by Suryaa Desk | Sat, Nov 02, 2024, 07:49 PM
ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారంలో 2025 ఫిబ్రవరి 12న మినీ జాతర నిర్వహించనున్నారు. ఆ రోజు నుంచి నాలుగు రోజులపాటు మేడారం మినీ జాతర జరగనుంది. ఈ మేరకు అక్టోబర్ 26న సమావేశమైన మేడారం పూజారులు.. మినీ జాతర తేదీలను వెల్లడించారు. జాతరకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు ప్రారభించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులను మేడారం పూజారుల సంఘం కోరింది.
మేడారం జాతర ప్రతి రెండేళ్లకు ఓసారి ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి21న జాతర ప్రారభం కాగా.. నాలుగు రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. తెలంగాణ కుంభమేళాగా పిలిచే ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, ఒరిస్సా, చత్తీస్ఘఢ్ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇక వచ్చే ఏడాది మినీ జాతరను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు వచ్చే భక్తుల కోసం దేవాదాయ శాఖ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనుంది. మౌలిక వసతులు, తాగునీటి సౌకర్యం, టాయిలెట్లు, రవాణా, భద్రత ఏర్పాట్లు చేయనుంది. మినీ మేడారం జాతరకు కూడా భక్తులు భారీగానే తరలిరానున్నారు. భక్తుల రాకతో మేడారం జాతర జరిగే పరిసరాలు కిటకిటలాడుతుంటాయి. గద్దెల ముందు పొర్లు దండాలు పెట్టి బంగారం (బెల్లం) సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.
మేడారం జాతర చరిత్ర విషయానికి వస్తే.. పూర్వం కోయదొర మేడరాజు వేటకోసం అడవికి వెళ్తాడు. అక్కడ పెద్ద పులుల కాపల మధ్య ఓ పసిపాప ఆయనకు కనిపించింది. ఆ పాపను తన గూడెం తీసుకువెళ్లాడు కోయరాజు. పాప రాకతో గూడెంలో అన్ని శుభాలే జరగడంతో ఆమెను వనదేవతగా భావించి మాఘ శుద్ధ పౌర్ణమి రోజు చిన్నారికి సమ్మక్క అని నామకరణం చేశారు. మేడరాజు కాకతీయ రాజులకు సామంత రాజుగా ఉంటూ పాలన సాగించేవాడు. ఆయన తన మేనల్లుడైన పగిడిద్ద రాజుకు సమ్మక్కను ఇచ్చి వివాహం చేయడంతో సమ్మక్క మేడారం చేరుకుంది.
సమ్మక్క పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న సంతానం. కాకతీయ రాజుల కింద సామంత రాజ్యంగా ఉన్న మేడారం రాజ్యానికి కరువు వచ్చింది. ఆ సమయంలో కప్పం కట్టలేమని చెప్పగా.. కాకతీయ రాజులు మేడారంపై యుద్ధం ప్రకటించారు. దీంతో యుద్ధ భూములో సమ్మక్క, సారలమ్మ విరోచితంగా పోరాడారు. కాకతీయ సేనలు వెన్నుపోటు పొడవడంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టపైకి వెళ్లిన సమ్మక్క అంతర్ధానమైంది. ఆ తర్వాత ఓ చెట్టు కింద కుంకుమ భరిణ రూపంలో సమ్మక్క కనిపించిందని చరిత్ర చెబుతోంది. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు తన తప్పును తెలుసుకొని సమ్మక్కకు భక్తుడిగా మారాడు. అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకోసారి జాతర నిర్వహిస్తున్నారు.