by Suryaa Desk | Sun, Nov 03, 2024, 07:37 PM
ఏపీలో వైఎస్సాఆర్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఎపిసోడ్ గురించి అందరికీ తెలిసిందే. తామిద్దరం సహజీవనం చేస్తున్నామని శ్రీనివాస్, మాధురి వెల్లడించారు. ఇప్పటికే తన భార్య వాణికి విడాకుల నోటీసులు పంపించానని.. విడాకులు రాగానే తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు శ్రీనివాస్ వెల్లడించాడు. మాధురి సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడూ శ్రీనివాస్‌తో పరిచయం, వారిద్దరి మధ్య ఉన్న బంధం గురించి చెబుతోంది.
అయితే దువ్వాడ, దివ్వెల బంధంపై తాజాగా ఓ బీఆర్ఎస్ నేత కీలక కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేలను వారితో పోల్చుతూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి పరిస్థితి.. అరికెపూడి గాంధీ, సంజయ్ పరిస్థితి ఒకటేనని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేష్ వ్యాఖ్యానించారు. మాధురి తన భర్త పేరు చెప్పమంటే వేరొకరి పేరు చెబుతుందని.. శ్రీనివాస్‌తో మాత్రం కలిసి ఉంటున్నట్లు పలు టీవీ ఛానెళ్లకు వెల్లడించిందని గుర్తు చేశారు. వారి మాదిరే.. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, డాక్టర్ సంజయ్‌ల పరిస్థితి ఉందన్నారు. 'మొగుడు పేరు అంటే బీఆర్ఎస్ పేరు చెప్తారు.. కలిసి తిరుగేది మాత్రం కాంగ్రెస్‌తో... వీరి పరిస్థితి దువ్వాడ, దివ్వెల లాంటిదే' అని వ్యాఖ్యనించారు. ఓ య్యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్స్ చేయగా.. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.
కాగా, అరికెపూడి గాంధీ, డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గాంధీని పబ్లిక్ అకౌంట్ కమిటీ ఛైర్మన్‌గా నియమించారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ప్రతిపక్షాలకు ఇచ్చే పీఏసీ ఛైర్మన్ పదవిని పార్టీ మారిన గాంధీకి ఎలా ఇస్తారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. దీంతో తాను పార్టీ మారలేదని.. బీఆర్ఎస్‌లోనే ఉన్నానని గాంధీ వివరణ ఇచ్చుకున్నారు. సంజయ్ సైతం తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని అది పార్టీ కండువా కాదని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రం పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరిని దువ్వాడ, దివ్వెలతో పోలుస్తూ క్యామ మల్లేష్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఇక మల్లేష్ గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి భువనగిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.