by Suryaa Desk | Tue, Nov 05, 2024, 03:26 PM
ప్రభుత్వం ద్వారా కొనుగోళ్ళు జరిపే (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకొని, సంపూర్ణ మద్దతు ధరను పొందాలని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జగదేవపూర్ మండల కేంద్రంలోని గొల్లపల్లి రోడ్డు లో గల శ్రీనివాస కాటన్ ఇండస్ట్రీ లో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని గజ్వేల్ మార్కెట్ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయాలని సూచించారు.
రైతులు దళారులకు పత్తిని విక్రయించకుండా సిసిఐ కొనుగోలు కేంద్రాల్లోని పత్తిని విక్రయించాలని సూచించారు. దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని చెప్పారు. తేమశాతం లేకుండా రైతులు పత్తిని తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ హరినాథ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, మహేష్ యాదవ్, కరుణాకర్, రాము, రమేష్, మైసయ్య, మహేందర్ రెడ్డి, ఏఓ వసంతరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు...