![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 06:06 PM
హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలోని టాప్ 5 నగరాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో నగర ప్రజలకు మౌళిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. నగరంలో కొత్తగా ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, కొత్త రహదారుల నిర్మాణం, విస్తరణ వంటి పనులు ఇప్పటికే పూర్తి చేసింది. మరికొన్ని ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు, రోడ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు నగరం నుంచి ఈజీగా రాకపోకలు సాగించేలా సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట వరకు డబుల్ డెక్కర్ కారిడార్లు కూడా ప్రతిపాదించారు.
తాజాగా హైదరాబాద్ నగరానికి మణిహారమైన ఔటర్ రింగురోడ్డుపై తొలిసారిగా డబుల్ డెక్కర్ ఇంటర్‌చేంజ్ అందుబాటులోకి రానుంది. రెండేసీ ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలతో రెండు లేన్లతో ప్రాజెక్టును నిర్మించనున్నారు. బుద్వేల్ వద్ద HMDA లేఅవుట్ నుంచి రాకపోకలు సాగించేందుకు ఔటర్ రింగు రోడ్డుకు లింకు కోసం ఈ డబుల్ డెక్కర్ ఇంటర్‌చేంజ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ఓఆర్ఆర్ పైకి ఎక్కడ పడితే అక్కడే వాహనాలు వచ్చే అవకాశం లేదు. కేవలం ఇంటర్ ఛేంజ్‌ల వద్ద మాత్రమే ఔటర్ రింగు రోడ్డు పైకి, కిందకు వెహికల్స్ రాకపోకలు సాగించే వీలు ఉంటుంది. ప్రస్తుతం 19 ప్రాంతాల్లోమే మాత్రమే ఇంటర్ ఛేంజ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ కొత్తగా ఇంటర్‌ఛేంజ్‌లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
బుద్వేల్‌లో 182 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ లేఅవుట్ సిద్ధం చేయగా.. అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి మౌళిక వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.. లేఅవుట్ నుంచి నేరుగా అవుటర్ రింగ్ రోడ్డు పైకి చేరుకునేందుకు వీలుగా డబుల్ డెక్కర్ ఇంటర్‌ఛేంజ్‌ను నిర్మించ తలపెట్టారు. శంషాబాద్ వైపు ఎంట్రీ, ఎగ్జిట్‌తోపాటు పటాన్‌చెరు వైపు ఎంట్రీ, ఎగ్జిట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు లేన్లు ఒకదానిపై ఒకటి ఏర్పాటు చేయనున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు వెల్లడించారు. అవుటర్‌పై ప్రస్తుతం ఎక్కడా కూడా ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టలేదు. తొలిసారిగా బుద్వేల్ వద్ద డబుల్ డెక్కర్ ఇంటర్‌ఛేంజ్ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రానున్న ఏడాదిలోపు దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు వెల్లడించారు. ఈ ఇంటర్ ఛేంజ్ అందుబాటులోకి వస్తే బుద్వేల్‌లో ప్లాట్లు కొన్నవారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈజీగా ప్రయాణాలు సాగించొచ్చు.