|
|
by Suryaa Desk | Thu, Jan 22, 2026, 11:51 AM
గోల్కొండ కోట ప్రాంగణంలో చారిత్రక కటోరా హౌస్ పరిరక్షణకు హైడ్రా పూర్తి సహకారం అందిస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. 450 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ నీటి వనరును కాపాడేందుకు 'నిర్మాణ్' ఎన్‌జీవో ముందుకు వచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్కియాలజీ శాఖ సంరక్షణలో ఉన్న ఈ చెరువును హైడ్రా కమిషనర్ సందర్శించారు.కటోరా హౌస్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు సహకరించాలని కోరిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ పరిశీలించారు. ఈ నీటి వనరును కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలను హైడ్రా కమిషనర్‌కు 'నిర్మాణ్' ఎన్‌జీవో తరఫున పనులు పర్యవేక్షిస్తున్న కల్పనా రమేశ్, ఆర్కియాలజీ విభాగం అధికారులు వివరించారు. నీటి ట్యాంక్‌లో చెత్త వేయడానికి వీలు లేకుండా ఎత్తైన ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు, చుట్టూ పాత్‌వే అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు వారు తెలిపారు.ఈ చారిత్రక నీటి వనరులోంచి వేసిన మురుగునీటి పైపు లైనుకు ప్రత్యామ్నాయం చూపేందుకు సహకరించాలని హైడ్రా కమిషనర్‌ను వారు కోరారు. అభివృద్ధి పనులకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పడుతున్నాయని, హైడ్రా సహకారంతో కటోరా హౌస్‌కు పూర్వ వైభవం తీసుకువస్తామని వారు అన్నారు.