|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 03:37 PM
ఆంధ్రప్రదేశ్‌ను, దేశ కార్పొరేట్ రంగాన్ని కుదిపేసిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ స్కామ్‌తో ముడిపడి ఉన్న జన్వాడ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రత్యేక కోర్టు.. సత్యం వ్యవస్థాపకుడు బైర్రాజు రామలింగరాజు, ఆయన కుటుంబ సభ్యులు నందిని రాజు, తేజ రాజులతో పాటు మొత్తం 213 మందికి నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.ఈ కేసులో ఏ-153గా ఉన్న శతభిష కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేసిన అభినవ్ అల్లాడి (ఏ-12) అనే వ్యక్తి ఇటీవల ఈడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. జన్వాడ భూముల కొనుగోళ్లలో జరిగిన మోసపూరిత లావాదేవీల గురించి తనకు పూర్తి సమాచారం తెలుసని, తన వాంగ్మూలాన్ని సాక్షిగా నమోదు చేసుకోవాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. సత్యం స్కామ్ ద్వారా వచ్చిన వేల కోట్ల రూపాయలను హైదరాబాద్ శివార్లలోని విలువైన భూముల కొనుగోలుకు మళ్లించారని ఆయన తన పిటిషన్‌లో ఆరోపించారు.