|
|
by Suryaa Desk | Wed, Jan 21, 2026, 01:42 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో వాస్తవాలు ప్రజలకు తెలియకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ట్రిక్ ప్లే చేస్తున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు పిలుస్తున్న విషయాన్ని తెలుసుకున్న వెంటనే హరీశ్ రావు తెలంగాణ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సిట్ విచారణను పక్కదారి పట్టించేందుకే ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజంగా ఏం జరిగిందో తెలంగాణ సమాజానికి తెలియజెప్పేందుకే సిట్ దర్యాప్తు కొనసాగుతోందని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే విచారణలో బయటపడే నిజాలను దాచిపెట్టేందుకు బీఆర్‌ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సృజన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి కాంట్రాక్టులు కట్టబెట్టారని హరీశ్ రావు, కేటీఆర్ ఆరోపించడం సరికాదన్నారు. సృజన్ రెడ్డి బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి అల్లుడని, గతంలో తన అల్లుడిని ఎందుకు బద్నాం చేస్తున్నారని ఆయనే ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో కూడా సృజన్ రెడ్డి సహా పలువురికి కాంట్రాక్టులు దక్కాయని తెలిపారు. రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ నేతల మాదిరిగా దోచుకునే ఆలోచన లేదన్నారు.