|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 09:42 PM
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక 2026 సదస్సులో తెలంగాణ రాష్ట్రం మరో భారీ విజయాన్ని అందుకుంది. ' భారత్ ఫ్యూచర్ సిటీ ' నిర్మాణంలో భాగస్వామ్యం కావడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ముందుకొచ్చింది. తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగంగా అడుగులు వేస్తున్నారు. దావోస్ పర్యటనలో భాగంగా మంగళవారం యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. ఈ చర్చల్లో తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సుమారు 30,000 ఎకరాల భారీ విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన ఈ నగరం.. భారతదేశంలోనే మొట్టమొదటి 'నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీ'గా నిలవనుందని సీఎం తెలిపారు. ఈ నగరంలో ఏఐ (AI), విద్య, వైద్యం, పరిశ్రమలు, నివాస ప్రాంతాలు, వినోదం కోసం ప్రత్యేక జోన్లు ఉంటాయి. ఇప్పటికే మారుబేని, సెంబ్‌కార్ప్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. ఇటీవలే రిలయన్స్ గ్రూపునకు చెందిన ‘వంతారా’తో కలిసి ఇక్కడ ఒక భారీ జూ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీకి వివరించిన సీఎం.. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ విజన్‌తో ప్రభావితమైన యూఏఈ మంత్రి.. ప్రాజెక్టు అమలును వేగవంతం చేసేందుకు ఇరు ప్రభుత్వాల అధికారులతో కూడిన ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటును ప్రతిపాదించారు. కేవలం మౌలిక సదుపాయాలే కాకుండా.. యూఏఈ ఫుడ్ క్లస్టర్, తెలంగాణ అగ్రి-ఎకానమీ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి కూడా యూఏఈ ఆసక్తి కనబరిచింది. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరియు వ్యవసాయ రంగం మరింత బలోపేతం కానున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.