|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 11:20 PM
విధి నిర్వహణ ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ రైల్వే ఉద్యోగి జీవితంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఒక చిన్న అజాగ్రత్త, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆయనను జీవితాంతం వికలాంగుడిగా మార్చింది. నల్గొండ జిల్లా దామరచర్ల మండల పరిధిలోని విష్ణుపురం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో సికింద్రాబాద్‌కు చెందిన టీసీ శ్యామ్ కుమార్ తన రెండు కాళ్లను కోల్పోయారు.
వివరాల్లోకి వెళితే.. నల్గొండ పట్టణానికి చెందిన శ్యామ్ కుమార్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో టికెట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి తన షిఫ్ట్ ముగించుకున్న ఆయన.. సోమవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. నల్గొండ స్టేషన్‌లో దిగాల్సిన శ్యామ్ కుమార్.. ప్రయాణంలో అలసట వల్ల గాఢ నిద్రలోకి జారుకున్నారు. దీంతో రైలు నల్గొండ దాటిపోయిన విషయాన్ని ఆయన గమనించలేదు.
మెలకువ వచ్చేసరికి రైలు నల్గొండ స్టేషన్ దాటి చాలా దూరం వచ్చేసింది. తర్వాతి స్టేషన్ ఎక్కడో దూరంలో ఉండటంతో.. కంగారుపడిన ఆయన ఎలాగైనా దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో దామరచర్ల మండలం విష్ణుపురం సమీపంలో రైలు వేగం కొంత తగ్గడాన్ని గమనించిన శ్యామ్ కుమార్.. రైలు కదులుతుండగానే కిందకు దిగే ప్రయత్నం చేశారు. రైలు దిగుతున్న సమయంలో ఆయన పట్టుతప్పి ప్రమాదవశాత్తు చక్రాల కింద పడిపోయారు. వేగంగా వెళ్తున్న రైలు చక్రాలు ఆయన కాళ్లపై నుంచి వెళ్లడంతో.. మోకాళ్ల వరకు రెండు కాళ్లు అక్కడికక్కడే తెగిపోయాయి. తీవ్ర రక్తస్రావంతో విలపిస్తున్న శ్యామ్ కుమార్‌ను గమనించిన తోటి రైల్వే సిబ్బంది, స్థానికులు వెంటనే స్పందించారు.
సమాచారం అందుకున్న మిర్యాలగూడ రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని తొలుత మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ.. కాళ్లు కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కదులుతున్న రైలు నుంచి దిగడం ప్రాణాపాయమని, రైల్వే నియమ నిబంధనలు తెలిసిన ఉద్యోగులే ఇలాంటి ప్రమాదాలకు గురికావడం విచారకరమని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు.