|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 09:59 PM
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు (SHG) వడ్డీ లేని రుణాలను అందిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. యాదగిరిగుట్టలో జరిగిన ' ఇందిరా మహిళా శక్తి సంబరాలు' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మెప్మా ఆధ్వర్యంలో 87 సంఘాలకు వివిధ బ్యాంకులు, శ్రీనిధి సహకారంతో రూ. 12,73,00,000 విలువైన బ్యాంకు లింకేజీ చెక్కును పంపిణీ చేశారు. అలాగే.. మున్సిపాలిటీ పరిధిలోని సంఘాలకు రూ. 98,23,458 వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు. మహిళలకు 'పుట్టింటి సారె'గా ఇందిరమ్మ చీరలను మంత్రి పంపిణీ చేశారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల కోసం విప్లవాత్మక మార్పులు తెచ్చిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 265 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని, దీని కోసం ప్రభుత్వం రూ. 10 వేల కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కొత్తగా 16,152 మందికి రేషన్ కార్డులు మంజూరు చేశామని, పేదలకు నాణ్యమైన సన్న బియ్యాన్ని అందిస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు పెట్రోల్ బంకులను కూడా మహిళల పేరుతోనే కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
రూ. 100 కోట్లతో యాదగిరిగుట్ట అభివృద్ధి
యాదగిరిగుట్ట పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. త్వరలోనే రూ. 100 కోట్ల వ్యయంతో పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రూ. 210 కోట్లతో చేపట్టిన పైప్‌లైన్ పనులు ముగింపు దశలో ఉన్నాయని.. త్వరలోనే ప్రతి ఇంటికి గోదావరి జలాలు అందుతాయని హామీ ఇచ్చారు. గంధమల్ల రిజర్వాయర్ పూర్తి అయితే ఆలేరు నియోజకవర్గ పరిధిలో సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. 18 నుండి 100 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తామని, యాదగిరిగుట్టను అభివృద్ధి పథంలో ముందంజలో నిలుపుతామని అన్నారు.