|
|
by Suryaa Desk | Wed, Jan 21, 2026, 01:37 PM
ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ సంచలన నిర్ణయం తీసుకుంది. తన ప్రఖ్యాత హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ వ్యాపారాన్ని చైనాకు చెందిన టీసీఎల్ ఎలక్ట్రానిక్స్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కు అప్పగించనున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇందులో భాగంగా సోనీ బ్రావియా టీవీ బ్రాండ్‌తో సహా, తన హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో 51 శాతం మెజారిటీ వాటాను టీసీఎల్‌కు విక్రయించనుంది.ఈ ఒప్పందం ప్రకారం, ఇరు కంపెనీలు కలిసి ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. ఇది 2027 ఏప్రిల్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. భవిష్యత్తులో టీవీలు సోనీ, బ్రావియా బ్రాండింగ్‌తోనే మార్కెట్లోకి వస్తాయి. అయితే, వాటిలో ఉపయోగించే డిస్‌ప్లే టెక్నాలజీ మాత్రం టీసీఎల్‌కు చెందినదిగా ఉంటుంది. తక్కువ లాభదాయకత ఉన్న టెలివిజన్ తయారీ రంగం నుంచి వైదొలగడంలో భాగంగానే జపాన్ కంపెనీ అయిన సోనీ ఈ నిర్ణయం తీసుకుంది.ఈ ఏర్పాటు ద్వారా తయారీ ఖర్చులు, నష్టాలను తగ్గించుకుంటూనే, ప్రపంచవ్యాప్తంగా తమ బ్రాండ్‌కు ఉన్న గుర్తింపును నిలుపుకోవచ్చని సోనీ భావిస్తోంది. ప్లేస్టేషన్ వ్యాపారంతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సోనీ, కొంతకాలంగా సంప్రదాయ ఎలక్ట్రానిక్స్ నుంచి అధిక లాభాలు వచ్చే విభాగాలపై దృష్టి సారిస్తోంది.