|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 09:53 PM
తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కసరత్తు వేగవంతం చేసింది. అందులో భాగంగా రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ (ఎస్ఈసీ) రాణి కుముదిని.. జిల్లాలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎస్ఈసీ ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జనవరి 21, 22, 23 తేదీల్లో వివిధ జిల్లా కలెక్టర్లతో కూడా సమావేశాలు నిర్వహించి.. ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధతపై చర్చించనున్నట్లు సమాచారం.
కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లపై చర్చించిన తర్వాత.. మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అందులో భాగంగా జనవరి 24 లేదా జనవరి 27న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ప్రభుత్వం అధికారికంగా వివరాలు వెల్లడించలేదు.
కాగా, ఇటీవల మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో మున్సిపల్ ఎన్నికలనిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఫిబ్రవరి నెలలో ఎన్నికలు జరపాలని నిర్ణయిస్తూ ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను ఎలక్షన్ కమిషన్ వేగవంతం చేసింది. ఇదిలా ఉండగా, 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి మేయర్, చైర్పర్సన్ పదవుల రిజర్వేషన్లను ఖరారు చేసి.. మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.
మున్సిపల్ ఎన్నికలను ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. అభ్యర్థుల అర్హతలు, నిబంధనలు, వ్యయ పరిమితులపై రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను విడుదల చేసింది. పారదర్శకతను పెంచేందుకు నిబంధనలను కఠినతరం చేసింది. మార్గదర్శకాల ప్రకారం.. కార్పొరేషన్ అభ్యర్థులకు రూ. 10 లక్షలు, గ్రేడ్ - 1 మున్సిపాలిటీలకు రూ. 5 లక్షల వరకు వ్యవ పరిమితిని విధించింది ఎన్నికల సంఘం. అందులో భాగంగా అభ్యర్థులు నామినేషన్ వేసే ముందే ప్రత్యేక బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలి. అందులో ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే ఫ్లెక్సీలు, సోషల్ మీడియా ప్రకటనలు, భోజనాలు, వాహనాల ఖర్చులను ఈ ఖాతా ద్వారానే లెక్కించాలి.
మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే కాంగ్రెస్ ఇంచార్జ్లన ప్రకటించింది. మరోవైపు బీఆర్ఎస్ కూడా సిద్ధమవుతోంది. అంతేకాకుండా జనసేన పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించగా.. కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి నేతలు కూడా పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.