|
|
by Suryaa Desk | Wed, Jan 21, 2026, 05:04 PM
మధిర మున్సిపాలిటీ పరిధిలోని 17, 18 మరియు 21వ వార్డుల్లో బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ రూపొందించిన 'బాకీ కార్డులను' ప్రజలకు పంపిణీ చేశారు. స్థానిక ప్రజలతో ముచ్చటిస్తూ ప్రస్తుత ప్రభుత్వ పాలనలో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
ఈ పర్యటనలో కమల్ రాజు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో భట్టి విక్రమార్క ఇచ్చిన అనేక గ్యారంటీలు ఇప్పటికీ కాగితాలకే పరిమితమయ్యాయని, క్షేత్రస్థాయిలో ఏ ఒక్క హామీ సక్రమంగా అమలు కావడం లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, అధికారం చేపట్టిన తర్వాత పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆయన మండిపడ్డారు.
మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే అధికార పార్టీకి అభివృద్ధి పనులు గుర్తుకు వస్తున్నాయని కమల్ రాజు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం పట్టణంలో జరుగుతున్న శంకుస్థాపనలు కేవలం ఓట్ల కోసమేనని, ఎన్నికలు ముగియగానే ఈ పనులన్నీ అటకెక్కుతాయని ఆయన విమర్శించారు. అభివృద్ధి పనుల పేరిట కాంగ్రెస్ నేతలు ప్రజలను మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, గతంలో ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా మున్సిపాలిటీలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఎందుకు మంజూరు చేయడం లేదని కమల్ రాజు ప్రశ్నించారు. సొంత ఇల్లు లేని ఎంతోమంది పేదలు ఆశగా ఎదురుచూస్తున్నా, ప్రభుత్వం మొండిచేయి చూపుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని, తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.