|
|
by Suryaa Desk | Wed, Jan 21, 2026, 09:26 PM
సింగరేణి గనుల కేటాయింపుల విషయంలో గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. హరీష్ రావు, కేటీఆర్ చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలని, ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా వారు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. గనుల వేలం, కేటాయింపుల ప్రక్రియలో ప్రభుత్వం పారదర్శకతను పాటిస్తోందని, రాజకీయ లబ్ధి కోసం సింగరేణి సంస్థ ప్రతిష్టను దెబ్బతీయవద్దని మంత్రి సూచించారు.
గత పదేళ్ల పాలనలో జరిగిన పరిణామాలను బయటకు తీస్తామని చెబుతూ, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. 2014 నుంచి 2026 వరకు జరిగిన గనుల కేటాయింపులపై పూర్తిస్థాయి విచారణకు తాము సిద్ధమని, విచారణ ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. గనుల కేటాయింపుల్లో ఎవరు తప్పు చేశారో, ఏ ఒప్పందాలు జరిగాయో ఎంక్వైరీ ద్వారా తేలుతుందని, అప్పుడే నిజానిజాలు ప్రజల ముందుకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీలు లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నాయని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే ఇరు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కేంద్రంలోని బీజేపీతో కలిసి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని, ఇలాంటి ద్వంద్వ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. గతంలో చేసిన తప్పులకు శిక్షగా ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయినా ప్రతిపక్ష నేతల్లో మార్పు రావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు వాస్తవాలను గ్రహించారని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారనుందని ఆయన హెచ్చరించారు.