|
|
by Suryaa Desk | Thu, Jan 22, 2026, 11:47 AM
ప్రపంచవ్యాప్తంగా యువ పారిశ్రామికవేత్తల విషయంలో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 40 ఏళ్లలోపు వయసున్న సెంటీమిలియనీర్ల (వంద మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద) జాబితాలో చైనా, యూకే వంటి దేశాలను భారత్ అధిగమించింది. అవెండస్ వెల్త్ మేనేజ్‌మెంట్, హురున్ ఇండియా సంయుక్తంగా బుధవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ జాబితాలో మొత్తం 505 మంది యువ వ్యాపారవేత్తలు ఉండగా, వారిలో 201 మంది భారతీయులే కావడం విశేషం.ఈ నివేదిక ప్రకారం, భారత్ నుంచి 201 మంది, చైనా నుంచి 194 మంది, యూకే నుంచి 110 మంది యువ వ్యాపారవేత్తలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. దేశంలో అత్యధికంగా బెంగళూరు నుంచి 48 మంది పారిశ్రామికవేత్తలు ఈ జాబితాలో ఉండటంతో, ఆ నగరం 'ఇండియాస్ యూ40 క్యాపిటల్'గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. 36 నుంచి 40 ఏళ్ల వయసు ఉండి, తొలితరం పారిశ్రామికవేత్తలకు కనీసం 100 మిలియన్ డాలర్లు, వారసత్వ వ్యాపారవేత్తలకు 200 మిలియన్ డాలర్ల వ్యాపార విలువ ఉన్న వారిని ఈ జాబితా కోసం పరిగణనలోకి తీసుకున్నారు.భారత్‌లో పెరుగుతున్న వ్యవస్థాపక స్ఫూర్తికి అద్దం పట్టేలా, జాబితాలోని భారతీయ పారిశ్రామికవేత్తలలో 83 శాతం మంది తొలితరం వారేనని నివేదిక పేర్కొంది. వీరిలో సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు, సేవల రంగం నుంచి అత్యధికంగా 40 మంది ఉండగా, ఆ తర్వాత హెల్త్‌కేర్ (18), రవాణా (16), ఆర్థిక సేవల (15) రంగాల వారు ఉన్నారు. ఈ యువ పారిశ్రామికవేత్తల సంస్థల మొత్తం విలువ 357 బిలియన్ డాలర్లు కాగా, ఇవి 4.43 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి. 'ఈ తరం పారిశ్రామికవేత్తలు ఇప్పటికే దేశ జీడీపీ, ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నారు' అని అవెండస్ వెల్త్ మేనేజ్‌మెంట్ ఎండీ అండ్ సీఈవో అపూర్వ సాహిజ్వానీ తెలిపారు.