|
|
by Suryaa Desk | Thu, Jan 22, 2026, 11:52 AM
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పాల్గొనడంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సమీక్షలో ఎలా పాల్గొంటారని ఆయన ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి విజయం సాధించిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పక్షాన కొనసాగుతుండడం తెలిసిందే.ఈరోజు గాంధీ భవన్‌లో నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే సంజయ్ పాల్గొనడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే జీవన్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు.అనంతరం గాంధీ భవన్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌లోనే ఉన్నట్లు సంజయ్ అఫిడవిట్ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో తాము ఆ పార్టీ నుంచి అవమానాలను ఎదుర్కొన్నామని, అలాంటి పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను తమ పక్కన కూర్చోబెట్టడం సరికాదని అన్నారు.పదేళ్లు బీఆర్ఎస్‌పై పోరాటం చేశామని, ఇప్పుడు పోరాటం చేసిన వారినే గాంధీ భవన్‌కు రానిస్తే కార్యకర్తలకు ఏమని సమాధానం చెప్పాలని నిలదీశారు. సమీక్ష సమావేశానికి సంజయ్ రావడం జీర్ణించుకోలేక తాను పీసీసీకి క్షమాపణలు చెప్పి గాంధీ భవన్ నుంచి బయటకు వచ్చానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడిన వారిని చులకనగా చూసే పరిస్థితి వస్తుందని తాము ఊహించలేదని అన్నారు.