|
|
by Suryaa Desk | Thu, Jan 22, 2026, 11:24 AM
జలమండలి సరఫరా చేసే తాగునీటిని రెండో సారి వృధా చేసిన ఇంటి నల్లా కనెక్షన్ తొలగించారు. ఈ ఇంటి యజమాని గతంలో నీటిని వృధా చేసినందుకు పదివేల రూపాయలు జరిమానా విధించారు. ఈ ఘటన బంజారా హిల్స్ లో జరిగింది. గత సెప్టెంబర్ 3 న జలమండలి బంజారా హిల్స్ రోడ్ నం. 12 లో ఓ వ్యక్తి తాగునీటి సంపు నిండి ఓవర్ ఫ్లో అయి దాదాపు ఒక కిలో మీటర్ వరకు తాగునీరు రహదారిపై ప్రవహించింది.. దీంతో ఓ అండ్ డివిజన్ స్థానిక మేనేజర్ వెళ్లి పరిశీలించి తాగునీటిని వృధా చెయ్యకూడదని చెప్పారు. అతనికి నోటీసు అందించి, ఆ వ్యక్తికి రూ.10000 జరిమానా విధించారు. అంతే కాకుండా మరో సారి ఇలా చేస్తే కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరించారు. బుధవారం జలమండలి స్థానిక అధికారులు బంజారా హిల్స్ ప్రాంతంలో ఉన్నతాధికారుల పర్యటన సందర్బంగా తనిఖీ చేస్తూ వెళుతుండగా... రోడ్ నం. 12 లో నీరు లీకేజి అయినట్టు గమనించి.. గతంలోనూ నిర్లక్ష్యంతో నీటిని వృధా చేసినందుకు ఈ వ్యక్తికే జరిమానా విధించారని సరిచూసుకుని ఆగ్రహం వ్యక్తం చేసి.. రెండో సారి నీటిని వృధా చేసినందుకు ఆ ఇంటి నల్లా కనెక్షనను తొలగించారు.జలమండలి సరఫరా చేసే తాగునీరు ఇలా ఇతర అవసరాలకు వినియోగించద్ధని, అలాగే విలువైన త్రాగునీటిని వృధా చేయకూడదని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే.. తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.