|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 07:50 PM
ఏపీ మాజీ సీఎం జగన్ మాస్ డైలాగ్‌ను రిపీట్ చేశారు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు. అధికారాన్ని దుర్వినియోగం చేసేవారిని భవిష్యత్తులో జవాబుదారీగా చేస్తామన్నారు. వారు రిటైర్ అయినా సరే.. వదలిపెట్టబోమని హెచ్చరించారు. తన పార్టీ సభ్యులను టార్గెట్‌గా చేసుకుని వేధిస్తున్న పోలీసు అధికారులను ఉద్దేశించి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణకు హాజరైన నేపథ్యంలో హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
"కావాలనే రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్‌లో పెట్టి, వారిని ఉపయోగించి.. మా మీద రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నేను మాత్రం అధికారులకు ఒక్కటే చెబుతున్నాను. మీరు అన్యాయంగా, అక్రమంగా వ్యవహిరిస్తే.. ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే.. మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఏ బొక్కలో దాక్కున్నా, సప్త సముద్రాల బయట ఉన్నా.. మిమ్మల్ని పట్టుకొచ్చి విచారిస్తాము. ఎవరినీ వదిలిపెట్టే ప్రశ్నే లేదు. చట్టాన్ని అతిక్రమించినా, న్యాయబద్ధంగా వ్యవహరించకపోయినా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసినా, తప్పుడు లీకులు ఇచ్చిన పోలీసు అధికారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇంతకంతకు అనుభవిస్తారు. జాగ్రత్త.. ఆలోచించుకోండి" అని హరీశ్ రావు వార్నింగ్ ఇచ్చారు.
దానికి మీదే బాధ్యత..
"రిటైర్ అయిన తర్వాత రేపు వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీకు సహకరించదు. మీ సొంత డబ్బులతో, సొంతంగా లాయర్లను పెట్టుకుని కేసులు వాదించుకోవాల్సి వస్తుంది. అన్ని దృష్టిలో పెట్టుకుని చట్టబద్ధంగా వ్యవహరించండి. రేవంత్ రెడ్డి దావోస్ నుంచి ఇచ్చే డైరెక్షన్ ప్రకారం కాదు.. మీరు చట్టప్రకారం వ్యవహరించండి. దావోస్ నుంచో, సీపీ నుంచో ఇంకెవరి నుంచైనా.. తప్పుడు ఆదేశాలను మీరు పాటించి చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం.. దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాను" అని మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జగన్ డైలాగ్..
గతంలో ఏపీ మాజీ సీఎం జగన్ కూడా ఇలాగే అక్కడి అధికార పక్షానికి ఇలాగే వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టేవాళ్లు ఎంతటి వాళ్లైనా సరే వదిలిపెట్టబోమని తీవ్రంగా హెచ్చరించారు. ఉద్యోగం నుంచి రిటైరైనా, విదేశాలకు పారిపోయినా పట్టుకోస్తామని జగన్ చెప్పారు. లోకేశ్ పేరుతో తరచూ ఉపయోగించి రెడ్ బుక్‌ను ఉద్దేశిస్తూ.. బుక్ పేరు ఏదైనా సరే.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ల పేర్లు రాసిపెట్టుకోండి. వాళ్లకు కచ్చితంగా సినిమా చూపిద్దాం అంటూ వైసీపీ శ్రేణులకు భరోసా కల్పించారు జగన్. అంతేకాకుండా కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదని.. కేసులకు, జైళ్లకు భయపడకూడదన్నారు. అలాంటి తెగువ, ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలమని అని చెప్పారు.