|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 02:35 PM
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం కాచవాని సింగారం గ్రామంలోని సర్వే నంబరు 66 లో ఉన్న 6.12 ఎకరాలు ప్రభుత్వ భూమి మాత్రమే. జిల్లా సర్వే అధికారి చాలా స్పష్టంగా ప్రభుత్వ భూమిగా నిర్ధారించి హద్దులను చూపిన తర్వాతే అక్కడ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ఇప్పటికే ఇళ్లు కట్టుకున్న వారిని మినహాయించి.. మిగిలిన భూమిని హైడ్రా సోమవారం కాపాడింది. సర్వే నంబరు 62తో పాటు 63ను చూపించి 66లొ ఉన్న ప్రభుత్వ భూమిలోకి చొరబడి ప్లాట్లుగా విక్రయించింది హనుమంతరెడ్డి కుటుంబ సభ్యులని స్పష్టమైన ఆధారాలు హైడ్రా వద్ద ఉన్నాయి. దివ్యానగర్ లే ఔట్‌లో భాగంగానే ఇక్కడ ప్లాట్లు అమ్మడమైంది. 66 సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిని తన విద్యా సంస్థలకు అందజేయాలని 2009లో నల్లమల్లారెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఇలా 6.12 ఎకరాల ప్రభుత్వ భూమిని తన ఆధీనంలో ఉంచుకొని 3 ఎకరాల మేర నల్లమల్లారెడ్డి కుటుంబ సభ్యులు మామిడి తోట వేశారు. ప్రైవేటు భూమికి సంబంధించిన 62, 63 సర్వే నంబర్లు చూపించి 66 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూమిలో దాదాపు 50 ప్లాట్లను మలిపెద్ది హనుమంతరెడ్డి కుటుంబ సభ్యులు అమాయకపు ప్రజలకు అమ్మేశారు.
మలిపెద్ది హనుమంత రెడ్డి కుటుంబ సభ్యులు ప్లాట్లుగా చేసి అమ్ముకుంటే.. నల్లమల్లారెడ్డి నేరుగా 3 ఎకరాల ప్రభుత్వభూమిలో మామిడి తోట వేశారు. ఇలా మొత్తం 6.12 ఎకరాలను కాజేసే ప్రయత్నాలను హైడ్రా అడ్డుకుంది. 6.12 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలకు సంబంధించి 2010లో నల్లమల్లారెడ్డికి ఘట్కేసర్ ఎమ్మార్వో నోటీసులు కూడా ఇచ్చారు. ప్రభుత్వభూమిలో ప్లాట్లు విక్రయించినందుకు గాను బాధితులకు ప్రత్యామ్నాయం చూపాల్సిన నల్లమల్లారెడ్డి, హనుమంతరెడ్డి వారికి అన్యాయం జరిగిందంటూ గగ్గోలు పెట్టడం గమనార్హం. ప్రభుత్వ భూమిని ఆక్రమించినందుకు గాను మేడిపల్లి పోలీసు స్టేషన్‌లో హైడ్రా సొమవారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నల్లమల్లారెడ్డి, హనుమంతరెడ్డి కుటుంబ సభ్యలుపై కేసు (94 ఆఫ్ 2026 సెక్షన్లు 318(4),329(3)బీఎన్ ఎస్,3 పీడీపీపీఏ) నమోదయ్యింది. గతంలోనే జిల్లా సర్వే అధికారి నియమించిన సర్వే కమిటీ ప్రభుత్వ భూమిగా నిర్ధారించి సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది. ఏడీ సర్వే బృందం వచ్చి సోమవారం హద్దులు నిర్ధారించిన తర్వాత మాత్రమే హైడ్రా చర్యలు తీసుకుంది. చుట్టుపక్కల ఉన్న లే ఔట్లన్నీ కలిపి రహదారులు, పార్కుల హద్దులు పట్టించుకోకుండా దివ్యానగర్ లే ఔట్ పేరుతో చేసిన అరాచకాలపై గతేడాది హైడ్రా చర్యలు తీసుకుంది. 200 ఎకరాలకు పైగా ఉన్న దివ్యానగర్ లే ఔట్‌లో అడ్డుగోడలు తొలగించి 2218 ప్లాట్ల యజమానులకు దారి చూపింది హైడ్రా. అక్కడ ఎవరైనా అవసరాలకోసం ప్లాట్లు అమ్మాలన్నా.. కొనాలన్నా.. నల్లమల్లారెడ్డి అనుమతితోనే జరిగేట్టు ఉన్న పరిస్థితులను హైడ్రా మార్చింది. దీంతో అక్కడి ప్లాట్లకు మంచి ధర లభించింది. దీంతో హైడ్రాకు, ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలుచేసి ప్లాట్ల యజమానులు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడి అటవీ భూమిని ఎకరాలకొద్దీ ఆక్రమించిన విషయమై నల్లమల్లారెడ్డిపై విచారణ జరుగుతోంది. వీటి నుంచి బయట పడడానికి అమాయకులను ముందు పెట్టి హైడ్రా చర్యలను అడ్డుకునే ప్రయత్నం నల్లమల్లారెడ్డి చేస్తున్నారు. ప్రభుత్వ భూమిలో ప్లాట్లు కొని నష్టపోయిన వారితో గురువారం ప్రెస్‌మీట్ పెట్టించి తప్పుదోవ పట్టించడాన్ని హైడ్రా ఖండిస్తోంది. నల్లమల్లారెడ్డి చేతిలో మోసపోయిన వారిలో చాలా వరకూ సింగరేణి కార్మికులే ఉన్నారు. గతంలోనూ.. తాజా ఆక్రమణల తొలగింపులోనూ హైడ్రా చర్యలపై పలు సందర్భాల్లో కోర్టును ఆశ్రయించినా.. ఎక్కడా ఆయనకు ఊరట లభించని విషయం ప్రస్తావించదగ్గది.