|
|
by Suryaa Desk | Thu, Jan 22, 2026, 05:42 PM
సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగరబోతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలపై వార్డుల ఇంచార్జిలతో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక దిశానిర్దేశం చేశారు. మెజారిటీ కాదు.. అన్ని వార్డులు గెలవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు.సిరిసిల్ల ఒకప్పుడు ఎలా ఉందో, బీఆర్‌ఎస్ పాలనలో ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలకు స్పష్టంగా వివరించాలని కేటీఆర్ సూచించారు. “మన పని మనమే చెప్పుకోవాలి.. వేరే వాళ్లు చెప్పరు” అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇక స్థానిక ఎన్నికలు లేవని, నేరుగా సాధారణ ఎన్నికలే ఉంటాయని గుర్తుచేస్తూ, ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని చెప్పారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. జిల్లాల పునర్విభజన పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారని, రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎత్తివేయాలనే కుట్రలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. ఈ అంశం ప్రజల్లో, న్యాయవాదులు, మేధావుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. రేవంత్ పాలనను తుగ్లక్ తరహా పాలనగా అభివర్ణించారు.