|
|
by Suryaa Desk | Thu, Jan 22, 2026, 06:35 PM
ఆక్రమణలపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. ఒకే రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో చర్యలు చేపట్టింది. గచ్చిబౌలిలో ఓ విలువైన పార్కు స్థలాన్ని కాపాడగా, శామీర్‌పేటలో ఏళ్లుగా మూతపడిన రహదారికి విముక్తి కల్పించింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అధికారులు ఈ చర్యలు చేపట్టారు.వివరాల్లోకి వెళితే, గచ్చిబౌలి టెలికాం నగర్‌లో 1982 నాటి లేఅవుట్‌లో 4000 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. అయితే, కాలక్రమేణా ఇందులో 1500 గజాలు ఆక్రమణకు గురై నిర్మాణాలు వెలిశాయి. మిగిలిన 2500 గజాల స్థలాన్ని కూడా కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో స్థానికులు హైడ్రా ప్రజావాణిని ఆశ్రయించారు. కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. లేఅవుట్ ప్రకారం అది పార్కు స్థలమని నిర్ధారించుకుని, 2500 గజాల స్థలంలోని ఆక్రమణలను తొలగించారు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఫెన్సింగ్ వేసి, 'పార్క్ స్థలం' అని బోర్డును ఏర్పాటు చేశారు.మరో ఘటనలో, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేటలోని ఫ్రెండ్స్ కాలనీలోనూ హైడ్రా చర్యలు చేపట్టింది. 1987 నాటి లేఅవుట్‌లోని 20 అడుగుల రోడ్డును కొందరు ఆక్రమించి గోడలు, గేటు నిర్మించారు. దీనిపై ప్రజావాణికి ఫిర్యాదు అందడంతో హైడ్రా అధికారులు గురువారం ఆక్రమణలను తొలగించి, రహదారిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.