|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 08:47 AM
ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ శుభవార్త అందించింది. తెలంగాణలోని చర్లపల్లి నుంచి కేరళలోని తిరువనంతపురం మధ్య నడిచే కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ రైలు ఆంధ్రప్రదేశ్‌లోని పలు కీలక స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ కొత్త సర్వీసును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (జనవరి 23) తిరువనంతపురంలో జెండా ఊపి ప్రారంభించనున్నారు.ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆంధ్రప్రదేశ్‌లో సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట జంక్షన్లలో ఆగుతుంది. దీనివల్ల రాష్ట్రంలోని ప్రయాణికులకు దక్షిణ భారతదేశంలోని ముఖ్య నగరాలకు ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఇక తెలంగాణలో ఈ రైలుకు నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో హాల్ట్ కల్పించారు.ఈ రైలు షెడ్యూల్ ప్రకారం, తిరువనంతపురంలో ఉదయం 10:45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4:30 గంటలకు చర్లపల్లి జంక్షన్‌కు చేరుకుంటుంది. తెలంగాణకు మరో అమృత్ భారత్ రైలును కేటాయించినందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు.