|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 04:01 PM
పార్కులు, రహదారుల కబ్జాలపై హైడ్రా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. గత కొన్ని రోజులుగా ఆక్రమణలు తొలగిస్తూ వస్తున్న హైడ్రా శుక్రవారం మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి మండలంలోని గోపాల్‌నగర్లో 3300 గజాల పార్కును కాపాడింది. 148 నుంచి 155 వరకూ ఉన్న సర్వే నంబర్లలో 92.21 ఎకరాల మేర గోపాలనగర్ పేరిట లే ఔట్ వేశారు. 1980లో వేసిన ఈ లే ఔట్‌లో 1200లకు పైగా ప్లాట్లున్నాయి. ఇందులో పార్కులకోసం 3 చోట్ల భూమిని అప్పట్లో లే ఔట్ వేసిన వారు కేటాయించారు. ఇప్పటికే 2 చోట్ల దాదాపు ఆక్రమణలకు గురి కాగా.. మూడో పార్కు కూడా కబ్జాలకు గురౌతోందని గోపాల్‌నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణకు ఆదేశించారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులతో హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించి పార్కు స్థలం కబ్జా అవుతున్నట్టు నిర్ధారించింది. హైడ్రా కమిషనర్ ఆదేశాలతో శుక్రవారం పార్కులో వేసిన షెడ్డును తొలగించింది. పార్కు చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. ``గోపాల్‌నగర్‌లో పార్కులను కాపాడాలని సంబంధిత శాఖలకు అనేక సంవత్సరాలు విన్నపాలు చేశాం.. కాని ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికే రెండు పార్కులు అన్యాక్రాంతం అయ్యాయి. ఇంత పెద్ద లే ఔట్‌లో పార్కులు లేక.. ప్రాణ వాయువు అందక అవస్థలు పడుతున్నామని మొత్తుకున్నా ఫలితం లేదు.. హైడ్రాకు ఫిర్యాదు చేసిన వెంటనే.. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించడం.. పార్కును కాపాడుతూ ఫెన్సింగ్ వేశారు. లేకుంటే ఈ పార్కు కూడా అన్యాక్రాంతమయ్యేది`` అని గోపాల్‌నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు. హైడ్రా చర్యలను అభినందించారు.