|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 07:54 PM
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయం ఎదుట అర్చకులు నిరసనకు దిగారు. ఆయల ఈవో శ్రీకాంతరావుతో తలెత్తిన వివాదం నేపథ్యంలో నిరసన చేపట్టారు. ఈవో తమను దుషించారని, అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అయితే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా కొందరికి ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించడంతో ఈ వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..
అర్చకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా.. 50 మంది అభిమానులకు ప్రత్యేక దర్శనం చేయించారు అర్చకులు. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచనల మేరకు అర్చకులు వారికి ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించారు. అయితే ఈ విషయం తనకు చెప్పకుండా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తారా అని, ప్రత్యేక దర్శనాలు ఎలా చేయిస్తారంటూ ఈవో శ్రీకాంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎవరు వచ్చినా దర్శనం చేస్తామని అర్చకులు సమాధానం ఇచ్చారు. దీంతో కోపోద్రిక్తుడైన ఆలయ ఈవో.. సస్పెండ్ చేస్తానంటూ హెచ్చరించినట్లు అర్చకులు ఆరోపిస్తున్నారు. ఈవో మాటలు ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీశాయి.
ఈవో శ్రీకాంతరావు అనుచిత వ్యాఖ్యలు చేశారని అగ్రహం వ్యక్తం చేసిన అర్చకులు.. ఆందోళనకు దిగారు. ఆలయ గోపురం ముందు బైఠాయించి నిరసన చేశారు. ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈవో పరుష పదజాలంతో తమను దూషించారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. అంతేకాకుండా తమ గౌరవాన్ని, ఆచార సంప్రదాయాలను కాపాడాలని కోరారు. కాగా, ఆలయం ముందు అర్చకుల నిరసన ఇదే తొలిసారి అని అర్చకులు చెబుతున్నారు. చివరికి స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవ తీసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో వివాదం సద్దుమణినట్లు సమాచారం.
కాగా, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ఈవో పదవిలో ఉన్నవారు వివాదంలో నిలవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కొండగట్టు ఆలయ ఈవోగా ఉన్న వెంకటేష్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కొండగట్టు ఆలయంలో నిధులు దుర్వినియోగం, అవకతకలు జరిగినట్లు రుజువు కావడంతో ఆలయ ఈవో వెంకటేష్‌ను సస్పెండ్ చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో అక్రమాలు జరగడం, రూ. 50 లక్షల నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటి ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు విచారణకు ఆదేశించారు. అనంతరం అడిషనల్ డిప్యూటీ జ్యోతి విచారణ జరిపి నివేదిక అందించడంతో ఈవో వెంకటేష్‌ను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్‌కు కొండగట్టు ఆలయ ఈవోగా బాధ్యతలు ఇచ్చారు. ప్రస్తుతం శ్రీకాంతరావు ఈవోగా ఉన్నారు.