|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 08:03 PM
మద్యం తాగి వాహనాలు నడిపే వారి పట్ల హైదరాబాద్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎంతలా అంటే.. మద్యం సేవించి వాహనం నడిపేవారు.. రోడ్డు టెర్రరిస్టులతో సమానమని ఇటీవల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అనేంతలా కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. ఇలాంటి వారిపై ఉక్కుపాదం మోపుతామని, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. అందులో భాగంగా నగరవ్యాప్తంగా డ్రంకన్ డ్రైవ్ టెస్టులు పెంచుతున్నారు. ఈ టెస్టుల్లో పట్టుబడిన వారికి జరిమానాలు, జైలు శిక్ష పడుతున్నాయి. అయితే కొందరిలో మార్పు రాకపోవడంతో వినూత్న ఆలోనచ చేశారు హైదరాబాద్ పోలీసులు.
2025 డిసెంబర్ 24 నుంచి 31 వరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రంకన్ డ్రైవ్‌లో కొంతమంది పట్టుబడ్డారు. వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఇటీవల కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో 270 మందికి జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డి జోయెల్ డేవిస్ తెలిపారు. అయితే డ్రంకన్ డ్రైవ్‌లో దొరికిన వారికి జైలు శిక్షలు లేదా జరిమానాలతోనే సరిపెట్టకుండా.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
దాని ప్రకారం.. శిక్ష పడ్డ వారిని వివరాలను.. వారు పనిచేసే ఆఫీసులకు, ఒకవేళ విద్యార్థులైతే వారు చదువుకునే కాలేజీలకు పంపించనున్నారు. ఈ మేరకు ఓ లేఖ రాసి.. వారిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని పోలీసులు చెప్పారు. ఇలా చేయడం ద్వారా మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య భారీగా తగ్గుతుందని.. తద్వారా రోడ్లపై ప్రమాదాలు కూడా తక్కువవుతాయని పోలీసులు భావిస్తున్నారు.
కాగా, పోలీసులు ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా ఓ కారణం ఉంది. డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో ఎక్కువగా యుక్త వయసులో ఉన్న వారే పట్టుబడుతున్నారు. ఇలా చేస్తే అయినా.. ఇలాంటి వారిలో కొంత మార్పు వస్తుందన్న ఆశాభావంతో ఈ మేరకు పోలీసులు ఆఫీసులు, కాలేజీలకు లేఖలు రాయాలని భావించారు.
తీరు మార్చుకోని నగర వాసులు
ఇటీవల కొత్త సవంత్సరం సందర్భంగా మద్యం తాగి వాహనం నడపొద్దని పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. నగరంలోని వందకు పైగా ప్రాంతాల్లో.. డిసెంబర్ 31న రాత్రి ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని చెప్పారు. మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానాతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని.. జైలు శిక్ష కూడా విధిస్తామని హెచ్చరించారు. అయినా కొందరు నగరవాసులు తీరు మార్చుకోని మార్చుకోలేదు. ఒక్క రాత్రే రికార్డ్ డ్రంకన్ డ్రైవ్ కేసులు. నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే దాదాపు 1200 మందిపై డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. పోలీసుల హెచ్చరికలు బేఖాతరు చేసి మద్యం తాగి బండెక్కారు.