|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 03:21 PM
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో సిట్ దర్యాప్తును విమర్శిస్తూ మీడియా సమావేశం నిర్వహించిన 12 గంటల్లోపే తనకు నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ ముఖ్య నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది కచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రతీకార చర్యేనని ఆరోపించారు. ప్రభుత్వ హెచ్చరికలకు, నోటీసులకు భయపడేది లేదని, తన వద్ద ఉన్న ఆధారాలతోనే సిట్‌కు సమాధానం ఇస్తానని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో తమ పార్టీ సీనియర్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులకు సంబంధం లేకున్నా సిట్ వేధిస్తోందని శుక్రవారం మీడియా సమావేశంలో విమర్శించినట్లు ఆయన గుర్తుచేశారు. ఆ ప్రెస్ మీట్ ముగిసిన 12 గంటల్లోపే, శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు సిట్ పోలీసులు తన ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారని ప్రవీణ్ కుమార్ తెలిపారు. రెండు రోజుల్లో ఆధారాలతో సమాధానం ఇవ్వాలని, లేకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై గొంతెత్తడం ప్రతిపక్ష నేతగా తన హక్కు అని, ఇలాంటి వార్నింగులకు భయపడనని తేల్చిచెప్పారు.సిట్ చీఫ్ సజ్జనార్‌పై తాను వ్యక్తిగత ఆరోపణలు చేయలేదని, ఆయనపై ఏపీలో నమోదైన కేసులపై సిట్ వేయాలని డిమాండ్ చేసినట్లు నోటీసులో పేర్కొనడం వాస్తవ విరుద్ధమని అన్నారు.నేను వ్యక్తిగత దూషణలు చేయను చిల్లర భాషను వాడను. 2015లో ఓటుకు నోటు కేసు సమయంలో నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కెమెరాకు అడ్డంగా దొరికారు. ఆ తర్వాత ఏపీ నేతల ఫోన్లు ట్యాప్ చేశారని తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులపై కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో సజ్జనార్ కూడా ఇంటెలిజెన్స్ విభాగంలో అధికారిగా పనిచేశారు. అందుకే, ఇప్పుడు ఆయనే ఈ ట్యాపింగ్ కేసు దర్యాప్తుకు నేతృత్వం వహించడం నైతికంగా సరైంది కాదని మాత్రమే నా అభిప్రాయం చెప్పాను. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని తన వ్యాఖ్యలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమర్థించుకున్నారు.ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందని, బీఆర్ఎస్ నేతలపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న బొగ్గు కుంభకోణం వంటివాటిపై సిట్ ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. కేవలం ప్రభాకర్ రావు, ఆయన కుటుంబ సభ్యులు, కింది స్థాయి సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు చేయడం అన్యాయమని అన్నారు. బీఆర్ఎస్ నేతలకు మాత్రమే ఆగమేఘాల మీద నోటీసులు రావడం, దర్యాప్తు వివరాలు మీడియాకు లీక్ కావడం, కాంగ్రెస్ నేతలు గాంధీభవన్‌లో లైవ్ కామెంటరీలు ఇవ్వడం చూస్తుంటే ఇదంతా రాజకీయ కుట్ర అని స్పష్టమవుతోందని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా తమ పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు.