|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 08:20 PM
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం జాతర అంగరంగా వైభవంగా జరుగుతోంది. లక్షలాదిగా భక్తులు గిరిజన దేవతలను దర్శించుకోవడానికి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో మేడారం మహా జాతర కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల శాఖలు సంయుక్తంగా రూ. 3.70 కోట్లు నిధులు విడుదల చేశాయి. కాగా, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి.. ఈ నిధులు మంజూరు అయ్యేలా చొరవ తీసుకున్నారు.
కాగా, మేడారం మహా జాతరకు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నందున.. మెరుగైన సదుపాయాలు కల్పించడానికి నిధులను విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదే కాకుండా గతంలో కూడా కేంద్ర పర్యాటక శాఖ నిధులు మంజూరు చేసింది. మేడారంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ములుగు, లక్నవరం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత జలపాతం వంటి ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించానికి రూ. 80 కోట్లు ఇచ్చింది. గిరిజన సర్క్యూట్ పేరిట పర్యాటకులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడానికి, పలు అభివృద్ధి పనులు చేపట్టడానికి ఈ నిధులు విడుదల చేసింది. అంతకుముందు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ అభివృద్ధి కోసం రూ. 140 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.
మరోవైపు, జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న మేడారం మహా జాతరకు వచ్చే ప్రజల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే, తెలంగాణ ఆర్టీసీ సమన్వయంతో ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేశాయి. దక్షిణ మధ్య రైల్వే 28 స్పెషల్ ట్రైన్లు నడపనున్నట్లు ప్రకటించింది. అయితే మేడారం గ్రామానికి నేరుగా రైలు మార్గం లేదు. కానీ సమీపంలోని వరంగల్, కాజీపేట స్టేషన్లకు చేరుకోవడానికి ఈ రైళ్లు ఎంతో ఉపయోగపడనున్నాయి. జనవరి 28, 29 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లు ప్రధానంగా సికింద్రాబాద్ నుంచి మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్ మార్గాల్లో రైళ్లు నడవనున్నాయి. అంతేకాకుండా నిజామాబాద్ నుంచి వరంగల్‌కు, కాజీపేట నుంచి ఖమ్మం, ఆదిలాబాద్ ప్రాంతాలకు స్పెషల్ రైళ్లు నడుస్తాయి.
కాగా, మేడారం జాతరకు వచ్చే భక్తులు వరంగల్ లేదా కాజీపేట స్టేషన్లలో దిగిన తర్వాత.. అక్కడి నుంచి మేడారం చేరుకోవడానికి తెలంగాణ ఆర్టీసీ భారీగా బస్సులను ఏర్పాటు చేస్తోంది. రైల్వే స్టేషన్ల వద్దే ప్రత్యేక బస్ పాయింట్లను ఏర్పాటు చేస్తోంది. గతంలో కంటే ఈసారి సమన్వయం మెరుగ్గా ఉండటంతో ప్రయాణికులకు నిరీక్షణ సమయం తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.