|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 06:54 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని రాజకీయ కక్షగా చిత్రీకరించడం పూర్తిగా తప్పని, ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి జూపల్లి ఈ కేసులో ప్రజాస్వామ్య పద్ధతిలో, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌లో పాత్రధారులు ఎవరు దీని వెనుక సూత్రధారులు ఎవరు అన్నది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల పన్నుల డబ్బుతో నడిచే విజిలెన్స్, భద్రతా వ్యవస్థలను దుర్వినియోగం చేయడం దిగజారుడుతనమేనని వ్యాఖ్యానించారు. గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన చర్యలను చూస్తూ ఊరుకోవాలా దర్యాప్తే చేయకూడదా అని ఆయన ప్రశ్నించారు.ఈ కేసులో ఎవరినీ లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకోవడంలేదని, పూర్తిగా చట్టబద్ధంగానే విచారణ సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని అప్పట్లోనే వి.ప్రకాశ్ అనే వ్యక్తి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా తన ఫోన్ ట్యాప్ అయినట్టు గతంలో వెల్లడించిన విషయాన్ని ప్రస్తావించారు. ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి కూడా ఇదే విషయం చెప్పారని అన్నారు. మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురైందన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయని చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్ సహా మరికొందరు కూడా తమ ఫోన్లు ట్యాప్ అయి ఉండొచ్చని అంగీకరించారని జూపల్లి తెలిపారు.కేటీఆర్‌కు కేవలం 160 సీఆర్పీసీ కింద మాత్రమే నోటీసులు ఇచ్చారని, ఆయనను నేరస్తుడిగా పరిగణించలేదని మంత్రి స్పష్టం చేశారు. సాక్షిగా సమాచారం కోసం మాత్రమే విచారణకు పిలిచామని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన కోదండరామ్‌ను కూడా గతంలో అక్రమంగా అరెస్ట్ చేసిన ఉదంతాన్ని గుర్తు చేస్తూ చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి విచారణ చేయడం కొత్త విషయం కాదన్నారు.ఈ సందర్భంగా మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుపై కూడా మంత్రి ప్రశ్నలు సంధించారు. కీలక సమయంలో ఆయన అమెరికాకు ఎందుకు వెళ్లారని నిలదీశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు తిరిగి భారత్‌కు వచ్చారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో మార్పులకు అనేక కారణాలున్నాయని, వాటిపై కూడా సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.