by Suryaa Desk | Mon, Sep 30, 2024, 08:17 PM
హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చార్మినార్ కూల్చేయాలని అక్కడి ఎమ్మార్వో చెబితే కూల్చేస్తారా..? అంటూ కమిషనర్ రంగనాథ్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది. ఈనెల 22న అమీన్‌పూర్ పరిధిలో పలు ఇండ్లను హైడ్రా అధికారులు నేలమట్టం చేయగా.. బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశం కోర్టులో ఉండగానే కూల్చేశారంటూ బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నోటీసుల గడవు ముగియకముందే సామాన్లు తీసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌పై నేడు హైకోర్టలో విచారణ జరిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్‌గా హాజరు కాగా.. అమీన్‌పూర్ తహసీల్దార్ న్యాయస్థానం ముందు హాజరయ్యారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న భవనాల కూల్చివేతపై హైకోర్టు సీరియస్ అయింది. 48 గంటల్లో ఇండ్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి.. 40 గంటల్లోనే ఎలా కూల్చేశారని అమీన్‌పూర్ ఎమ్మార్వోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ సంజాయితీతో సంతృప్తి చెందని న్యాయస్థానం.. ఆదివారం నాడు కూల్చివేతలేంటని ప్రశ్నించింది.
హైడ్రాకు కూల్చివేతలు తప్ప వేరే పాలసీ లేదని అనిపిస్తోందని.. ఇది ప్రజల అభిప్రాయమని హైకోర్టు వ్యాఖ్యానించింది. మధ్యలో కలుగుజేసుకోబోయిన కమిషనర్ రంగనాథ్ పైనా హైకోర్టు సీరియస్ అయింది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధి నిర్ణయించుకుండా కూల్చివేతలు ఏంటని ప్రశ్నించింది. అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పాలని చురకలంటించింది. అమీన్‌పూర్ గురించి మాత్రమే మాడ్లాడాలని.. కావూరి హిల్స్ ప్రస్తావన అవసరం లేదని చెప్పింది. చార్మినార్‌ను సైతం కూల్చేయాలని అక్కడి ఎమ్మార్వో చెబితే కూల్చేస్తారా..? అంటూ రంగనాథ్‌పై హైకోర్టు ధర్మానసం ఆగ్రహం వ్యక్తం చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'హైడ్రా' వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గ్రేటర్ పరిధిలోని అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు విరుచుకుపడుతున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తోంది. ఈ క్రమంలోనే గత ఆదివారం అమీన్‌పూర్‌లో కూల్చివేతలు చేపట్టగా.. బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. నేడు ఈ పిటిషన్‌పై విచారణ జరగ్గా.. హైడ్రా కమిషనర్, అమీన్‌పూర్ తహసీల్దార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.