by Suryaa Desk | Mon, Sep 30, 2024, 08:50 PM
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి సర్కార్.. ఇప్పటికే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. మూడు విడతల్లో 2 లక్షల మేర రుణాలు ఉన్న రైతుల అకౌంట్లతో డబ్బులు జమ చేసింది ప్రభుత్వం. అయితే.. ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీని పూర్తి చేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. చాలా మంది రైతుల అప్పు అలాగే ఉండటం గమనార్హం. అందుకు కారణం కొన్ని సాంకేతిక కారణాలు కాగా.. వాటిని కూడా పరిష్కరించి.. ఆ రుణాలు కూడా తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ముఖ్యంగా.. ఆధార్ కార్డులు, బ్యాంకు పాస్ పుస్తకాల్లో రైతుల పేర్లు తప్పుగా ఉండటం కారణంగా కొందరు రైతులకు రుణమాఫీ అమలు కాలేదు. రుణమాఫీ మార్గదర్శకాల్లో రేషన్ కార్డు కంపల్సరీ చేయగా.. ఆ తర్వాత రేషన్ కార్డు లేని వారికి కూడా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో.. రేషన్ కార్డులు లేని వారికి కూడా రుణమాఫీ కాలేదు.
అయితే.. రుణమాఫీ కాని వాళ్లంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేళ.. ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. రేషన్ కార్డులేని రైతుల రుణమాఫీకి మార్గం సుగమం అయ్యింది. గ్రామాల వారీగా రేషన్ కార్డులేని రైతు కుటుంబాల నిర్ధారణ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షలకుపైగా రేషన్ కార్డు లేని రైతులకు రుణమాఫీ కాలేదని అధికారులు నిర్ధారించారు. ఇక.. ఆధార్, బ్యాంకు పాసుబుక్‌లలో తప్పుగా ఉన్న పేర్లను కూడా అధికారులు సవరించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 20 వేలకు పైగానే.. ఆధార్, బ్యాంక్ అకౌంట్ తప్పులను అధికారులు సరిచేసినట్టు తెలుస్తోంది.
దీంతో.. మూడు విడతల్లోనూ రుణమాఫీ కాని రైతులందరి అప్పులు తీర్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ రెడీ చేసింది కూడా. రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగేనే.. రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు అధికారులు. సుమారు 5 లక్షల రైతుల ఖాతాల్లో మొత్తం 5 వేల కోట్లు జమకానున్నాయి.
అయితే.. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ జూలై 18వ తేదీన రైతు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించింది. మొదటి విడతలో భాగంగా లక్ష వరకు మాత్రమే రుణాలున్న 11 లక్షల 34 వేల మంది రైతుల ఖాతాల్లో.. 6 వేల కోట్ల నిధులు జమ చేసింది. ఆ తర్వాత.. జూలై 30వ తేదీన రెండో విడతలో భాగంగా లక్ష నుంచి లక్షన్నర వరకు రుణాలున్న 6 లక్షల 40 వేల మంది అన్నదాతల ఖాతాల్లో 6 వేల 90 కోట్లు జమ చేసింది. ఇక.. ఆగస్టు 17న మూడో విడుతలో భాగంగా లక్షన్నర నుంచి 2 లక్షల వరకు రుణాలున్న అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన విషయం తెలిసిందే.