|
|
by Suryaa Desk | Fri, May 30, 2025, 06:23 AM
తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. ఈరోజు కూడా కవిత సొంత పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత వ్యవహారంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం స్పందించారు.హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ, కవిత తెలంగాణ వాదులను కలవడం నేరం కాదని, కానీ నాయకులు, కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయడం మాత్రం కచ్చితంగా నేరమని ఆయన అన్నారు. ఈ పనులన్నీ కేసీఆర్ నేర్పించినవి కావా? అని ఈటల ప్రశ్నించారు."బీజేపీ స్టేట్ ఫైట్ చేస్తుంది తప్ప, స్ట్రీట్ ఫైట్ చేయదు. నీచ రాజకీయాలు మేము చేయబోము" అని ఆయన స్పష్టం చేశారు. పదేళ్ల పాటు కేసీఆర్‌ను నమ్మి ప్రజలు మోసపోయారని, ఆ తర్వాత కాంగ్రెస్‌ను నమ్మి మరోసారి భంగపడ్డారని విమర్శించారు. నేతల మధ్య కంచెలు నాటింది కేసీఆర్ అయితే, దాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఎదురుపడితే నమస్కారం పెడతానని, అది తన సంస్కారమని ఈటల పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కమిషన్ విచారణకు ఒక ఎంపీగా, మాజీ ఆర్థిక మంత్రిగా తాను తప్పకుండా హాజరవుతానని ఆయన స్పష్టం చేశారు.