|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 02:46 PM
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఓ అవార్డుల కార్యక్రమంలో వేదికపై అభిమాని సెల్ఫీ ప్రయత్నాన్ని సున్నితంగా నివారించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, షారుఖ్ కేవలం ఈవెంట్ ప్రొటోకాల్‌ను పాటించారని ఎక్కువమంది నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఇటీవల 'జాయ్ అవార్డ్స్ 2026' కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో ఓ అవార్డును అందించడానికి షారుఖ్ వేదికపైకి వెళ్లారు. అదే సమయంలో ఓ వ్యక్తి ఆయనతో సెల్ఫీ దిగేందుకు తన ఫోన్‌ను తీశారు. దీన్ని గమనించిన షారుఖ్ నవ్వుతూనే ఆ వ్యక్తి చేతిలోంచి ఫోన్‌ను తీసుకుని, ఈవెంట్ అధికారిక ఫొటోగ్రాఫర్ల వైపు చూడాలని సైగ చేశారు. కాసేపటి తర్వాత ఫోన్‌ను తిరిగి ఇచ్చేశారు.ఈ వీడియో ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. కొందరు షారుఖ్ తీరును తప్పుబట్టాలని చూసినా, చాలామంది ఆయన చర్యను సమర్థించారు. అధికారిక కార్యక్రమాల్లో వేదికపై వ్యక్తిగత సెల్ఫీల కంటే నిర్వాహకుల ఫొటోగ్రఫీకే ప్రాధాన్యం ఉంటుందని, షారుఖ్ ఆ నిబంధననే గౌరవించారని పలువురు కామెంట్స్ చేశారు.
Latest News