![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 10:45 AM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూట్ మార్చారు. ఇక మీదట ప్రజల్లోనే ఉండాలని డిసైడ్ అయ్యారు. ఇందుకు రెండు కారణాలు చెబుతున్నారు గులాబీ నేతలు.పార్టీని బలోపేతం చేయడం, కార్యకర్తలను స్థానికసంస్థల ఎన్నికలకు సిద్ధం చేయడం మొదటి కారణమైతే.. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో అరెస్ట్ తప్పదన్న కాంగ్రెస్ పార్టీపై ప్రత్యక్ష పోరాటానికి దిగడం రెండో కారణంగా చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు దర్యాప్తులో వేగం పెరుగుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దీంతో పోలీసులు నోటీసులిచ్చినా, అరెస్ట్ చేసినా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడే చేయాల్సి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తుంది. ఇప్పటికే తాను అరెస్ట్‌కు భయపడనని.. దమ్ముంటే అరెస్ట్ చేసుకోండంటూ పలుమార్లు ప్రకటించారు కేటీఆర్.కేటీఆర్ ముఖ్యంగా పార్టీ పునర్ నిర్మాణంపై దృష్టిసారించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులకు భయపడి చాలామంది నేతలు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. . జిల్లా పర్యటనలతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపాలని కేటీఆర్ భావిస్తున్నారు. సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్‌లో నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభకు లక్షలాది మందిని తరలించాలని ప్లాన్ చేశారు కేసీఆర్. అధికారంలో ఉంటే జనసమీకరణ సులభమే కానీ ప్రతిపక్షంలో ఉండటం వల్ల కొంత కష్టపడాల్సి వస్తుందంటున్నారు గులాబీ నేతలు. అందుకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నేతలు, కార్యకర్తలకు దగ్గరవుతున్నారు కేటీఆర్. కష్టపడ్డవారికే భవిష్యత్‌లో అవకాశాలుంటాయని భరోసా ఇస్తున్నారు. కేసులను ఎదుర్కొని పార్టీ కోసం నిలబడ్డ వారికి పదవులు వెతుక్కుంటూ వస్తాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పటికే దాదాపు 25 నియోజకవర్గాలకు పార్టీ ఇంచార్జ్‌లు లేరు. త్వరలో జిల్లా కమిటీలు, మండల కమిటీల్లో కమిటెడ్ క్యాడర్‌కే పదవులు ఇస్తామన్నారు.
ఏడాది పాటు సిల్వర్ జూబ్లీ వేడుకలు జరపాలని నిర్ణయించారు గులాబీ బాస్. సంవత్సరమంతా సంబరాలు జరపాలంటే కార్యకర్తలకు మరింత బూస్టప్ అవసరమని బీఆర్ఎస్ భావించింది. అందుకే కేటీఆర్‌ను రంగంలోకి దింపింది. కేటీఆర్ సూర్యాపేట పర్యటనతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీకి కొత్త ఊపు వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదన్న విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు కేటీఆర్. ప్రజలు అధికారం కట్టబెట్టినా.. ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా బీఆర్ఎస్ సక్సెస్ అయిందన్నారు కేటీఆర్. రాబోయే కాలమంతా బీఆర్ఎస్‌దేనంటూ క్యాడర్‌కు భరోసా ఇచ్చారు. ఈనెల 23న కరీంనగర్‌లోనూ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు కేటీఆర్. క్యాడర్ ఫస్ట్ నినాదంతో బీఆర్ఎస్ దూసుకెళ్తుందంటున్నారు గులాబీ నేతలు.