![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 05:20 PM
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థుల నిరసనకు బీజేపీ నేత చికోటి ప్రవీణ్ కుమార్ మద్దతు పలికారు. సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని, కారులో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కారులో పోలీసులు తరలిస్తున్న సమయంలోనే చికోటి ప్రవీణ్ ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు బాధపడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలోనూ దారుణాలు, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని, ప్రకృతి విధ్వంసం చేయాలని కూడా చూస్తున్నారని ఆరోపించారు. విశ్వవిద్యాలయానికి చెందిన 400 ఎకరాల భూమిలో జింకలు, నెమళ్లు, కుందేళ్లు, ఉడతలు, పాములు వంటి ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయని తెలిపారు. ప్రకృతి విధ్వంసం చేయవద్దని డిమాండ్ చేశారు.హైదరాబాద్ నగర పరిసరాల్లో ఇప్పటికే 50 శాతానికి పైగా పచ్చదనం ధ్వంసమైందని, ఇప్పుడు కాంట్రాక్టులు, కమీషన్ల కోసం ప్రభుత్వ భూములను వేలం వేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. భూమి కేవలం మనుషులకు మాత్రమే కాదని, జంతువులు, పక్షులకు నిలయమని అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆ భూముల్లో నెమళ్ల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటి పాపం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని శాపనార్థాలు పెట్టారు.