![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 09:30 PM
రోజు రోజుకూ బంధుత్వాలు దూరమైపోతున్నాయి. కొందరు మానవత్వం మరిచి కర్కశత్వంగా ప్రవర్తిస్తున్నారు. తల్లి సమానమైన అత్తను వృద్ధాప్యంలో చూసుకోవాల్సిన ఓ కోడలు, ఆమెపై దాడికి చేసిన అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటుచేసుకుంది. అత్తగారిని కొడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.సరళా బాత్రా అనే పెద్దావిడ వృద్ధాశ్రమానికి వెళ్లేందుకు నిరాకరించిందని కోడలు నీలిక తన భర్త విశాల్ బాత్రాతో గొడవకు దిగింది. తన తల్లి వృద్ధాశ్రమానికి పంపించేది లేదని చెప్పడంతో ఈ విషయాన్ని నీలిక తన పుట్టింటివారికి చెప్పింది. దాంతో ఈ నెల 1న కొంతమంది గూండాలతో కలిసి నీలిక తండ్రి ఆదర్శ్ కాలనీలోని అల్లుడు విశాల్ బాత్రా ఇంటికి చేరుకున్నాడు. అనంతరం అల్లుడిపై చేయి చేసుకోవడం, ఆయనతో పాటు వచ్చిన వ్యక్తులు కూడా కొట్టడం చేశారు. ఇక ఇదే అదునుగా భావించిన నీలిక తన అత్తను కిందపడేసి ఘోరంగా కొట్టింది. కిందపడేసి ఈడ్చుకెళ్లడం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇక ఈ ఘటనపై విశాల్ బాత్రా తన తల్లి సరళా బాత్రాతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అత్తింటివారు దౌర్జన్యంగా తన ఇంట్లోకి చొరబడి తనతో పాటు తన తల్లిపై దాడి చేశారని పోలీసుల వద్ద వాపోయాడు. "మీరట్ సంఘటన లాగే, నా భార్య నన్ను, వృద్ధురాలైన నా తల్లిని చంపుతుందేమోనని భయపడుతున్నాను" అని విశాల్ బాత్రా విలేకరులతో అన్నారు. ఇక పోలీసులు మొదట్లో తనకు సహాయం చేయడానికి ఇష్టపడలేదని, కానీ తరువాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని బాత్రా పేర్కొన్నారు. శుక్రవారం అతను ఇదే విషయమై పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్లాడు. దాంతో విశాల్ బాత్రాకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.