|
|
by Suryaa Desk | Fri, Nov 14, 2025, 03:48 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రతిపక్షంగా తమ పాత్రను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. నిర్విరామంగా కృషి చేసిన కేసీఆర్ బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో కష్టాలకోర్చి పనిచేసిన కార్యకర్తలకు ఆయన నమస్సులందించారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపొందాలని స్థానిక నాయకత్వం ఎంతో శ్రమించిందని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం తామేనని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఇకపై ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన ఉద్ఘాటించారు. వ్యక్తిగత సమస్యలు ఉన్నప్పటికీ పార్టీ కోసం కార్యకర్తలు, నాయకులు ఎంతో ఉత్సాహంగా పనిచేశారని కేటీఆర్ అన్నారు. గత రెండేళ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ సమర్థవంతమైన పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు.మాగంటి సునీతకు రాజకీయ అనుభవం లేకపోయినా ఎంతో కష్టపడ్డారని ఆయన ప్రశంసించారు. ఒక విధంగా ఆమె పోరాటమే చేశారని కొనియాడారు. గత రెండేళ్లుగా బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా అద్భుతమైన పాత్రను పోషిస్తోందని ఆయన పునరుద్ఘాటించారు. ప్రజా సమస్యలను ప్రధానంగా ఎంచుకొని పోరాడుతున్నామని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.