|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 05:12 PM
తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులకు శుభవార్త అందించింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ఫైల్‌కు మోక్షం కల్పిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సుమారు 140 మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరింది.వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులకు సూపరింటెండెంట్లుగా పదోన్నతి కల్పించారు. 2018 కంటే ముందు ప్రమోషన్ పొందిన వారికి 10 శాతం కోటా కింద ఇప్పుడు సూపరింటెండెంట్లుగా అవకాశం ఇచ్చారు. రాష్ట్రంలోని రెండు మల్టీ జోన్ల పరిధిలో అర్హులైన 9 మందికి పదోన్నతి కల్పిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి (పీఆర్, ఆర్డీ) శాఖ డైరెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.అలాగే, పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న 130 మందికి పైగా సీనియర్ అసిస్టెంట్లకు ఒకేసారి సూపరింటెండెంట్లుగా ప్రమోషన్ కల్పించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సంబంధిత మంత్రులకు వారు ధన్యవాదాలు తెలిపారు.