|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 05:11 PM
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారించేందుకు ఏసీబీకి రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇవ్వడంపై ఆయన సోదరి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇతరులపై కేసులు పెట్టడం తప్ప బీజేపీకి మరో పని లేదని ఆమె ఎద్దేవా చేశారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ వైఫల్యం కారణంగా బస్తీల్లో ప్రజల ముఖం చూసే ధైర్యం కూడా కాంగ్రెస్ నేతలకు లేదని విమర్శించారు. అందుకే ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రతిపక్ష నేతలపై కుట్రపూరితంగా కేసులు పెడుతున్నారని ఆమె మండిపడ్డారు.దేశంలో ప్రస్తుతం కుట్రపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని, అందుకు తెలంగాణలోనే అనేక ఉదాహరణలు ఉన్నాయని కవిత అన్నారు. అయితే ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, దేశంలో చట్టం, న్యాయం ఉన్నాయని గుర్తుచేశారు. ఈ రాజకీయ కుట్రలను ప్రజలు తిప్పికొడతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.