|
|
by Suryaa Desk | Fri, Nov 21, 2025, 02:57 PM
సీఎం రేవంత్ రెడ్డికి తనను అరెస్ట్ చేసే ధైర్యం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వంపై, కాంగ్రెస్ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. "ఈ-కార్ రేసు కేసులో ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. నేను ఏ తప్పూ చేయలేదు. అందుకే లై డిటెక్టర్ టెస్టుకైనా సిద్ధంగా ఉన్నా" అని కేటీఆర్ స్పష్టం చేశారు.పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరిని కాపాడేందుకే దానం నాగేందర్‌తో రాజీనామా చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒకవేళ స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే ప్రభుత్వం పరువు పోతుందని, ఆ ముప్పు నుంచి తప్పించుకోవడానికే కాంగ్రెస్ ఈ రాజీనామా డ్రామాకు తెరలేపిందని విమర్శించారు. ముందుగా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉపఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు.