|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 07:35 PM
హైదరాబాద్ నాంపల్లిలోని ఒక ఫర్నిచర్ దుకాణంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం కొనసాగుతున్న నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు రావాలనుకునే సందర్శకులు, ట్రాఫిక్ రద్దీని, సహాయక చర్యలను దృష్టిలో ఉంచుకుని తమ పర్యటనను ఈరోజు వాయిదా వేసుకోవాలని కోరారు. నాంపల్లి స్టేషన్ రోడ్‌లో అగ్నిప్రమాద ప్రభావం వల్ల పరిసర ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడకుండా వాహనాలను ఇతర మార్గాల్లోకి దారి మళ్లిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని సీపీ తెలిపారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సమన్వయంతో పనిచేశారన్నారు. ప్రస్తుతం భవనంలో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని.. అయితే ఫర్నిచర్, రసాయనాలు దగ్ధం కావడంతో భవనం అంతా దట్టమైన పొగ అలుముకుందన్నారు. దీనివల్ల రెస్క్యూ టీమ్‌లు లోపలికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం స్టేషన్ రోడ్ మార్గంలో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
కాగా, నాంపల్లిలోని బచాస్ ఫర్నిచర్ క్యాజిల్ షోరూమ్‌లో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్రౌండ్ ఫ్లోర్ గోదాంలో మొదలైన మంటలు, అక్కడ ఉన్న ఫోమ్, రసాయనాలు, కలప కారణంగా నిమిషాల వ్యవధిలోనే నాలుగో అంతస్తు వరకు వ్యాపించాయి. ఈ ఘటన జరిగి ఐదు గంటలు గడుస్తున్నా.. భవనంలో చిక్కుకున్న ఆరుగురి ఆచూకీ లభించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఈ ప్రమాదంలో అత్యంత విషాదకరమైన అంశం ఏమిటంటే.. వాచ్‌మెన్ దంపతులకు చెందిన ఇద్దరు చిన్నారులు అఖిల్ (7), ప్రణీత్ (11) గదిలో చిక్కుకుపోయారు. తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. 'నా బిడ్డలను కాపాడండి' అంటూ ఆ తండ్రి చేస్తున్న ఆర్తనాదాలు అక్కడున్న వారిని కలచివేస్తున్నాయి. వీరితో పాటు మరో నలుగురు పెద్దవారు కూడా దట్టమైన పొగ కారణంగా బయటకు రాలేక పై అంతస్తుల్లోనే చిక్కుకుపోయారు. పదేళ్లుగా అక్కడే పనిచేస్తున్న మరో యువకుడి తల్లిదండ్రులు కూడా తమ కుమారుడి క్షేమం కోసం అధికారులను వేడుకుంటున్నారు.
ప్రమాద తీవ్రత దృష్ట్యా అగ్నిమాపక సిబ్బంది 10 ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. దట్టమైన పొగ కారణంగా రెస్క్యూ టీమ్ లోపలికి వెళ్లడం కష్టతరంగా మారడంతో.. అత్యాధునిక రోబో యంత్రాలను సహాయక చర్యల్లో వినియోగిస్తున్నారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చినా, దట్టమైన కార్బన్ మోనాక్సైడ్ పొగ వల్ల లోపలికి వెళ్లడం సవాలుగా మారిందని... స్థానికులు గోడలను బద్దలుగొట్టి గాలి వచ్చేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు.