|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 07:50 PM
నిజామాబాద్‌లో గంజాయి స్మగ్లర్లు అరాచకం సృష్టించారు. స్మగర్లను పట్టుకునేందుకు వెళ్లిన మహిళా కానిస్టేబుల్‌ను తీవ్రంగా గాయపరిచారు. కారుతో ఢీకొట్టి పరారయ్యేందుకు ప్రయత్నించారు. నిర్మల్ జిల్లా నుంచి నిజామాబాద్‌కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో.. అబ్కారీ అధికారులు మాధవనగర్ సమీపంలోని జాతీయ రహదారిపై నిఘా పెట్టారు. టీఎస్ 24 AF 4892 నంబరు గల కారులో వస్తున్న స్మగ్లర్లను అడ్డుకునేందుకు ఎక్సైజ్ బృందం ప్రయత్నించింది. అయితే.. అధికారుల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో స్మగ్లర్లు తమ కారును అధికారుల మీదికి వేగంగా పోనిచ్చారు. ఈ క్రమంలో మిగిలిన సిబ్బంది తప్పించుకున్నప్పటికీ.. కానిస్టేబుల్ సౌమ్యను కారు బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ సౌమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. కారు ఢీకొట్టిన వేగానికి ఆమె కిడ్నీ దెబ్బతిన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమెకు నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారు. ఉద్యోగంలో చేరి కేవలం 20 నెలలు మాత్రమే అవుతున్న యువ కానిస్టేబుల్ ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో తోటి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులు పారిపోయే క్రమంలో కారును స్తంభానికి ఢీకొట్టడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నిర్మల్ జిల్లాకు చెందిన సయ్యద్ సోహిల్, మరో వ్యక్తిగా గుర్తించగా.. వారి వద్ద నుంచి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు, ఈ ఘటనపై ఎక్సైజ్ సిబ్బంది తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తగిన రక్షణ కవచాలు, ఆయుధాలు లేకుండా సిబ్బందిని గంజాయి స్మగ్లర్ల వద్దకు పంపడం ఏంటని ఎస్‌హెచ్‌వో స్వప్నపై తోటి ఉద్యోగులు మండిపడుతున్నారు. సౌమ్యకు అయ్యే వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని.. ఆమె కుటుంబానికి 100 శాతం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ విషయంపై స్పందించిన డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి.. సౌమ్యకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఎక్సైజ్ సిబ్బంది నిరసన విరమించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.