|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 07:55 PM
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న నాంపల్లి ప్రాంతం భారీ అగ్నిప్రమాదంతో ఉలిక్కిపడింది. స్థానిక బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నివాస, వాణిజ్య భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో మొదలైన ఈ మంటలు.. నిమిషాల వ్యవధిలోనే ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఫర్నిచర్ తయారీలో వాడే రసాయనాలు, ఫోమ్, కలప ఉండటంతో దట్టమైన పొగ, మంటలు వేగంగా పై అంతస్తులకు వ్యాపించాయి.
ప్రమాద సమయంలో నాలుగు అంతస్తుల భవనంలో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఆరుగురు వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం. గ్రౌండ్ ఫ్లోర్ నుండి దట్టమైన పొగలు రావడంతో వారు బయటకు రాలేక పై అంతస్తుల్లోనే ఉండిపోయారు. స్థానికుల ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే అగ్నిమాపక సిబ్బంది 4 ఫైరింజన్లతో రంగంలోకి దిగారు. క్రేన్ల సహాయంతో భవనం పైభాగంలో ఉన్న వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమిస్తోంది. గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా మారడంతో లోపల ఉన్న వారి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది.
నాంపల్లి వంటి ఇరుకైన గల్లీలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకోవడం సవాలుగా మారుతోంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో.. వాణిజ్య సముదాయాల్లో ' ఫైర్ సేఫ్టీ ' నిబంధనలు పాటించకపోవడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నివాస గృహాల మధ్య ఇలాంటి గోడౌన్లు లేదా దుకాణాలు ఉండటం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
ప్రస్తుతానికి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు యంత్రాంగం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి.. ఎవరూ లోపలికి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. క్షతగాత్రులను తరలించేందుకు అంబులెన్స్‌లను కూడా సిద్ధంగా ఉంచారు. అయితే ప్రమాద తీవ్రత, ప్రమాదానికి గల కారణాలు, జరిగిన ఆస్తినష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.