|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 09:43 PM
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24: నగరంలోని రద్దీ ప్రాంతంగా ఉన్న నాంపల్లిలో శనివారం పెద్ద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ఫర్నిచర్ షోరూమ్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే భవనం మొత్తానికి వ్యాపించాయి.స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నాంపల్లి ప్రధాన రహదారిపై ఉన్న నాలుగు అంతస్తుల కమర్షియల్ భవనంలో ఈ ప్రమాదం సంభవించింది. భవనం కింద ఉన్న సెల్లర్‌లోని హోల్‌సేల్ ఫర్నిచర్ షాపులో మొదట మంటలు చెలరేగాయి. షాపులో అధికంగా ఫర్నిచర్ ఉండటంతో మంటలు వేగంగా పై అంతస్తుల వరకు వ్యాపించాయి. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేయడంతో ప్రజలు పరుగులు తీశారు.ప్రారంభంలో భవనంలో ఇద్దరు నుండి నాలుగు పిల్లలు చిక్కుకున్నట్లు సమాచారం వచ్చడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. అయితే, అగ్నిమాపక సిబ్బంది చేరకముందే స్థానిక యువకులు సాహసించి పిల్లలను భద్రంగా బయటకు తీసుకువచ్చారు. మిగిలిన కుటుంబాలను, పక్కన ఉన్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోని నివాసితులను అధికారులు వెంటనే ఖాళీ చేశారు.మంటలను అదుపు చేసేందుకు నాలుగు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరాయి. భవనం ఇరుకైన చోట ఉండటం, చుట్టూ సెట్‌బ్యాక్స్ లేకపోవడం కారణంగా అగ్నిమాపక యంత్రాలు లోపలికి వెళ్లలేకపోయాయి. దీనివల్ల సిబ్బంది పక్కభవనాల గోడలపై ఎక్కి, ప్రాణాలకు తెగించి మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ప్రధాన రహదారిపై జరిగిన ప్రమాదం కారణంగా నాంపల్లి నుంచి అబిడ్స్ వెళ్ళే మార్గంలో భారీ ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు వెంటనే వాహనాలను ఇతర మార్గాల్లోకి మళ్లించారు. గంటల తరబడి శ్రమించిన అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను ప్రాథమికంగా అదుపులోకి తీసుకువచ్చారు.ఈ ఘటనలో ఆస్తి నష్టం భారీగా ఉన్నప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం జరగనందుకు నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ఇలాంటి ఘటనలకు కారణం నగరంలోని ఇరుకైన ప్రాంతాల్లో అగ్నిమాపక నిబంధనలు పాటించకపోవడం అని అభిప్రాయపడుతున్నారు.
-మంత్రి పొంగులేటి స్పందన రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫర్నీచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదంపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి, మంటలకు కారణం, పరిష్కార మార్గాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంటలు వ్యాప్తి చెందకుండా పక్క భవనాల ప్రజలను ఖాళీ చేయాలని ఆదేశించారు. పోలీసులు, ఫైర్ అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు వేగవంతం చేయాలని, అదనపు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకురావాలని మంత్రి సూచించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఆదేశించారు.నుమాయిష్‌ను వాయిదా వేయాలని సూచన నాంపల్లిలోని ఫర్నీచర్ షాపులో అగ్ని ప్రమాదం కారణంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ నగరవాసులకు, ఒకరోజు నుమాయిష్ సందర్శనను వాయిదా వేయాలని సూచించారు. ప్రమాద కారణంగా ఘటనా ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిందని, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, సందర్శకులు ఆదివారానికి తమ ఎగ్జిబిషన్ పర్యటనను వాయిదా వేస్తే మంచిది అని చెప్పారు.ప్రాణరక్షణకు రెస్క్యూ టీమ్ సఫలత బచ్చా క్రిస్టల్ ఫర్నీచర్ షాపులోని నాలుగు అంతస్తుల భవనంలో ఆరుగురు, ఇద్దరు చిన్నారులతో సహా, ప్రారంభంలో మంటల్లో చిక్కుకున్నారు. ఫైరిరజన్లు రంగంలోకి వెళ్లి, జేసీబీలు, భారీ క్రేన్‌ల సహాయంతో పైభాగంలో ఉన్న వారిని భద్రంగా బయటకు తీసుకున్నారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.