|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 08:08 PM
గండిపేట మండలం, నార్సింగ్ విలేజ్, ఆరుణోదయ హౌసింగ్ సొసైటీలోని పార్కును కబ్జాల చెర నుంచి సోమవారం హైడ్రా విముక్తి కల్పించింది. నార్సింగ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాయానికి చేరువులో అరుణోదయ కాలనీ హుడా అనుమతి పొందిన లే ఔట్లో 6078 గజాలు పార్కు కోసం కేటాయించారు. ఈ పార్కు స్థలంపై స్థానికంగా ఉన్న వారి కన్ను పడింది. ఇప్పటికే 3 వేల గజాల వరకూ అక్రమ నిర్మాణాలు వచ్చేశాయి. మిగిలిన 3 వేల గజాల పార్కు స్థలంలో 1600 ల గజాలను స్థానికంగా ఉన్న వ్యక్తి కబ్జా చేశారు. ప్రీకాస్ట్ ప్రహరీ నిర్మించి.. అందులో షెడ్డులు వేశారు. ఈ 1600ల గజాల ఆక్రమణలపై గతంలో నార్సింగ్ మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకున్నారు. నిర్మాణాలను తొలగించారు. అయినా కబ్జాలు ఆగలేదు. నార్సింగి మున్సిపాలిటీ ఇప్పుడు జీహెచ్ ఎంసీలో కలవడం.. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ఇదే అదనుగా మళ్లీ 1600ల గజాలను తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. చుట్టూ ప్రీకాస్ట్ ప్రహరీ నిర్మించి.. లోపల తాత్కాలిక షెడ్డులు కూడా కట్టాడు. ఈ కబ్జా పూర్వాపరాలను వివరిస్తూ స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాలమేరకు హైడ్రా అధికారులు రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పార్కు స్థలంగానే నిర్ధారించుకున్నారు. మొత్తం పార్కు స్థలం 6078 గజాలు కాగా.. 3వేల గజాల వరకూ అక్రమ కట్టడాలు వచ్చేశాయి. మిగిలిన 3వేల గజాలను హైడ్రా సోమవారం కాపాడింది. పార్కు హద్దులను నిర్ధారిస్తూ చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. అలాగే పార్కు కోసం కేటాయించిన స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.