by Suryaa Desk | Wed, Jan 01, 2025, 02:56 PM
దక్షిణాది, బాలీవుడ్‌కు చెందిన దర్శక నిర్మాతలతో కలిసి ఇటీవల రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు నటుడు సిద్ధార్థ్. సినీ పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మంచి కథలతో కొన్ని చిత్రాలు రూపొందినప్పటికీ వాటికి మన దేశంలో సరైన గుర్తింపు ఉండటం లేదన్నారు. పాయల్ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ ఇందుకు ఉదాహరణగా చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఆ సినిమా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నప్పటికీ.. మన దేశంలో మాత్రం ప్రేక్షకులు దానిని ఆదరించలేదని తెలిపారు.‘‘దర్శకురాలు పాయల్ కపాడియాకు సంబంధించిన ఓ వైరల్ వీడియోను ఇటీవల నేను చూశా. అందులో ఆమె తాను తెరకెక్కించిన ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ సినిమా గురించి ప్రేక్షకులతో మాట్లాడుతూ కనిపించారు. ఈ చిత్రాన్ని తాము చూడాలనుకుంటున్నామని కొంతమంది ఆమెకు చెప్పారు. దానిపై ఆమె స్పందిస్తూ.. తన సినిమా విడుదలైందని.. ప్రేక్షకులు అనుకున్నస్థాయిలో రాకపోవడంతో దాన్ని థియేటర్ల నుంచి తీసేశారని చెప్పారు. కేన్స్ చిత్రోత్సవాల్లో అవార్డు, గోల్డెన్ గ్లోబ్ నామినేషన్స్‌తోపాటు వివిధ అవార్డులకు నామినేట్ అయిన ఈ చిత్రాన్ని మన దేశంలో ప్రేక్షకులు సరిగ్గా వీక్షించలేదు. ఆ సినిమాకు ఇంకా ఎంతో ఆదరణ రావాల్సింది’’ అని సిద్ధార్థ్ తెలిపారు.
కని కుశ్రుతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ (All We Imagine as Light). ముంబయి నర్సింగ్ హోమ్‌లో పనిచేసే కేరళకు చెందిన ఇద్దరు నర్సుల కథే ఇది. ఇద్దరూ కలిసి ఓ బీచ్ టౌన్‌కు రోడ్ ట్రిప్‌నకు వెళ్తారు. ఆ తర్వాత వారి జీవితాలు ఎలా మారాయి? అన్నదే చిత్ర కథాంశం. ఈ సినిమాకు అంతర్జాతీయ పబ్లికేషన్స్‌లో మంచి రివ్యూలు వచ్చాయి. కేన్స్ ఉత్సవంలో ‘గ్రాండ్ పిక్స్’ అవార్డు గెలుచుకుంది. 30 ఏళ్ల తర్వాత భారతీయ చిత్రానికి దక్కిన గౌరవమిది. బెస్ట్ నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ విభాగాల్లో ఈ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయింది. తెలుగులో ఈ చిత్రాన్ని రానా విడుదల చేశారు. జనవరి 3 నుంచి ఇది డిస్నీ + హాట్ స్టార్ వేదికగా విడుదల కానుంది.
Latest News