|
|
by Suryaa Desk | Thu, Dec 07, 2023, 01:52 PM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 01:20 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సహా కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ హాజరయ్యారు. కొత్త తెలంగాణ రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రిగా, చరిత్ర పుటల్లో తన పేరును లిఖించిన రెండో వ్యక్తి. ఆయనతో పాటు మరో 11 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
2006లో మహబూబ్‌నగర్ జిల్లాలో మిడ్జిల్ జెడ్‌బీటీసీగా ఎన్నికై రాజకీయ జీవితాన్ని ప్రారంభించి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలుపొందారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి.. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిపోయినా, మరుసటి ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచారు. 2021లో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికై 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం పదవిని చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆయన చేత ప్రమాణం చేయించారు. తెలంగాణ నూతన మంత్రిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు.