![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 11:55 AM
ఒకప్పుడు శ్రీలంకను వణికించిన ‘లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ) ఆ దేశాన్ని ఇంకా భయపెడుతోంది. నాడు ఎల్‌టీటీఈ పాతిపెట్టిన మందుపాతరలు ఇంకా వెలుగు చూస్తుండటమే ఈ భయానికి కారణం. మందుపాతరలను పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రాజెక్టుకు నిధులు నిలిపివేయాలని అమెరికా యోచిస్తోంది. అయితే, అమెరికా సాయం లేకుండా మందుపాతరలను తొలగించడం సాధ్యమయ్యే విషయం కాకపోవడంతో శ్రీలంక ప్రభుత్వం అయోమయంలో పడింది. అమెరికా తన సాయాన్ని కొనసాగించాలని కోరుతోంది.శ్రీలంక సైన్యం, ఎల్‌టీటీఈ మధ్య అంతర్యుద్ధం జరిగిన సమయంలో ఎల్‌టీటీఈ పెద్ద ఎత్తున మందుపాతరలు అమర్చింది. ఇవి ఇప్పుడు అక్కడి వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం సాయంతో వాటిని తొలగించేందుకు సంవత్సరాలుగా ల్యాండ్‌మైన్ నిర్వీర్య దళాలు శ్రమిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి అత్యధిక శాతం నిధులు అమెరికా అందిస్తోంది. ఇప్పుడు వాటిని నిలిపివేయాలని అమెరికా యోచిస్తోంది. అమెరికా కనుక నిధులు నిలిపివేస్తే ల్యాండ్‌మైన్ల తొలగింపు ఆగిపోయే అవకాశం ఉంది.2017 ఒట్టావా ఒప్పందం ప్రకారం 2028 నాటికి ఎల్‌టీటీఈ పాతిపెట్టిన అన్ని మందుపాతరలను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఇప్పుడు అమెరికా నిధులు నిలిపివేస్తే ఈ లక్ష్యం మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. 2002లో మందుపాతరల తొలగింపు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి 11 దేశాలు మద్దతుగా నిలవగా, అమెరికా పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చింది.