|
|
by Suryaa Desk | Thu, May 01, 2025, 10:19 AM
దేవరయాంజల్, కండ్లకోయ ప్రజలు సులభంగా జాతీయ రహదారి 44కు చేరుకునే అవకాశం హైడ్రా కల్పించింది. ఈ రెండు గ్రామాల మధ్య ఉన్న రహదారిని బండకుంట నరసింహారెడ్డి గేట్లు పెట్టి, రోడ్డును కొంత మేర తవ్వేసి ఆటంకాలు సృష్టించగా.. బుధవారం హైడ్రా వాటిని తొలగించింది. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా షామీర్‌పేట మండలం దేవరయాంజల్ విలేజికి ఉండే ప్రధాన రహదారిని మూసేశారంటూ స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించింది. రోడ్డుకు అడ్డంగా గేట్లు పెట్టి రాకపోకలకు ఆటంకాలు కలిగిస్తున్నారని నిర్ధారించుకుంది. కండ్లకోయ 135, 136 సర్వే నంబర్లలో జిల్లా న్యాయస్థాన సముదాయానికి కొంత స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అలాగే ఇవే సర్వే నంబర్లలో మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, మేడ్చల్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ నిర్మాణానికి కూడా కొంత స్థలాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. వీటి నిర్మాణం జరగాల్సి ఉండగా.. ఇప్పటికే ఈ మార్గంలో కొన్ని పరిశ్రమలు కూడా ఉన్నాయి. వీటితో పాటు కండ్లకోయ - దేవరయాంజల్ నివాసితులు కూడా ఇదే రోడ్డును వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మట్టి రోడ్డు ఉండగా.. త్వరలో 40 అడుగుల విస్తీర్ణంలో దాంబరు రోడ్డు నిర్మించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రహదారిపై ఆటంకాలు సృష్టించడం ఏంటని స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించాక అక్కడ నిర్మించిన గేట్లతో పాటు.. మరోవైపు రోడ్డుమీద అడ్డంగా వేసిన బండరాళ్లను హైడ్రా తొలగించింది. కందకం మాదిరి తవ్విన చోట మట్టిని నింపి రాకపోకలను పునరుద్ధరించింది. గూండాగిరితో రాకపోకలకు అంతరాయం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని.. హైడ్రాను స్థానికులు కోరారు. ఫిర్యాదుచేసిన వారం రోజుల్లోనే ఆటంకాలను తొలగించిన హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు.