|
|
by Suryaa Desk | Sat, Dec 27, 2025, 08:23 PM
గ్రేటర్ హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి, 20 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల విలీనంతో GHMC పరిధి భారీగా పెరిగింది. దీంతో దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా గ్రేటర్ హైదరాబాద్ అవతరించబోతోంది.విలీనం పూర్తైన తర్వాత గ్రేటర్‌ను మూడు భాగాలుగా విభజిస్తారన్న ప్రచారం మొదట జోరుగా సాగింది. అయితే గతంలో ఉన్న 150 వార్డులను ఇప్పుడు 300 వార్డులుగా పెంచుతూ ప్రభుత్వం ఆ చర్చకు బ్రేక్ వేసింది. అయినప్పటికీ డీలిమిటేషన్ అంశంపై రాజకీయ పార్టీల మధ్య గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో ప్రభుత్వం మాత్రం జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ల పోస్టింగ్‌లను వేగంగా పూర్తి చేసింది. అధికారులు కూడా తమకు అనుకూలమైన చోట పోస్టింగ్ కోసం పైరవీలు, లాబీయింగ్‌లు చేసినట్లు ప్రచారం సాగుతోంది. అయినా GHMC భవిష్యత్తు నిర్మాణంపై ప్రభుత్వ తుది వైఖరి ఇంకా స్పష్టంగా బయటకు రాలేదు. గ్రేటర్‌ను ఒకే మున్సిపల్ కార్పొరేషన్‌గా కొనసాగిస్తారా? లేక వంద వార్డులకు ఒక కార్పొరేషన్ చొప్పున మూడు ముక్కలు చేస్తారా? అన్నది ఇప్పటికీ అనుమానంగానే ఉంది.విలీనం, విభజనపై స్పష్టత లేకపోయినా పోస్టింగ్‌లు, కార్యాలయాల ఏర్పాటు వంటి అంశాలను రేవంత్ సర్కార్ వేగంగా పూర్తి చేస్తోంది. విపక్షాలకు పూర్తి క్లారిటీ రాకముందే ప్రభుత్వ నిర్ణయాలు ఒక్కసారిగా షాకింగ్‌గా మారుతున్నాయి. కలెక్టర్లు, వివిధ శాఖల హెడ్‌లుగా పనిచేసిన అధికారులను GHMC కమిషనర్ ఆధీనంలోకి తీసుకురావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. కొంతమందిని డిప్యూటీ కమిషనర్ పదవుల నుంచి తొలగించి జాయింట్ కమిషనర్లుగా నియమించడం కూడా బల్దియా వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.ఈ పోస్టింగ్‌లపై అవినీతి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నప్పటికీ, కొందరిని అదే హోదాలో కొనసాగించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. సర్కిల్స్, వార్డులు, జోన్ల పరిధులు, అధికారుల అధికారిక పరిమితులు వంటి అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నా, ప్రభుత్వం మాత్రం వేగంగా నిర్ణయాలు తీసుకుంటుండడం వెనక అసలు వ్యూహం ఏమిటన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్‌లో విలీనం, విభజనపై ఇంకా చాలా సమస్యలు పరిష్కారం కావాల్సి ఉన్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయినా సీఎం రేవంత్ మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. GHMC విషయంలో ఆయన తీసుకుంటున్న దూకుడు నిర్ణయాల వెనక పెద్ద స్కెచ్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఫిబ్రవరిలో GHMC పాలకవర్గం గడువు ముగియనుండటంతో, జనవరి చివరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి షెడ్యూల్ ప్రకారం GHMC ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ముందు గ్రేటర్ ఎన్నికలు పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. అందుకే జనవరి చివరిలో నోటిఫికేషన్ ఇవ్వాలంటే, ఆలోపే అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని సర్కార్ డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో విపక్షాల అభ్యంతరాలు, కోర్టు కేసులు ఎదురైనా, వార్డుల విభజన, సర్కిల్స్–జోన్ల వారీగా అధికారుల పోస్టింగ్ వంటి కీలక నిర్ణయాలను ప్రభుత్వం అమలు చేసిందని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికలకు ప్రధాన అడ్డంకిగా ఉన్న బీసీ రిజర్వేషన్ల అంశంపైనా ఒక దిశగా క్లారిటీ వచ్చిందని సమాచారం. బీసీ కోటా వ్యవహారం కోర్టులో ఉండటంతో, చట్టపరంగా రిజర్వేషన్లు అమలు చేయలేని పరిస్థితి ఉంటే పార్టీ పరంగా సర్దుబాటు చేసి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.జనవరి మధ్యలో సంక్రాంతి పండగ ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫిబ్రవరిలో మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించి, మార్చిలో విద్యార్థుల పరీక్షలు మొదలయ్యేలోపే ఎన్నికల ప్రక్రియను ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్‌పై రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాల్సి ఉంది.