|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 09:35 PM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పదవి ముప్పు ఉందని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ నారాయణ కీలక కామెంట్స్ చేశారు. రేవంత్‌కు పదవి గండం ఏర్పడితే అది రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వల్లే అని విమర్శించారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం ఆయన సీపీఐ అభ్యర్థుల పక్షాన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారాయణ.. జాతీయ స్థాయిలో ఉన్న పొత్తులను కాదని కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలకు పాల్పడిందని ఫైరయ్యారు. ఐదేళ్ల క్రితం పొంగులేటి ఏ పార్టీలో ఉన్నారో తెలుసుకోవాలని.. పార్టీలు మారే నాయకులకు ప్రజల్లో గుర్తింపు ఉండదని అన్నారు.
ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకు కంచుకోటని అని చెప్పారు. కమ్యూనిస్టులు తల్లిపాల వంటివారని.. తల్లి పాలకు, డబ్బా పాలకు మధ్య ఈ పోటీ జరుగుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి పోతుందా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలోని మొత్తం పురపాలికలు కాంగ్రెస్‌కే దక్కాలనే రాజకీయ దురుద్దేశంతోనే ఇక్కడ పొత్తులు కుదరనీయలేదన్నారు. సమస్యలు పరిష్కరించే వారికే ప్రజలు ఓటేయాలని.. ఈ సందర్భంగా నారాయణ పిలుపునిచ్చారు. కొత్తగూడెం ఓటర్లు అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెబుతుతారని కమ్యూనిస్టులను అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఆకాంక్షించారు.
కాగా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీతోనూ విభేదించి 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టున్న ఆయన.. అసెంబ్లీలో అడుగుపెట్టిన తొలిసారే మంత్రివర్గంలో చేరారు. రేవంత్ మంత్రి వర్గంలో కీలక మంత్రుల్లో ఒకరిగా పేరుతుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నారాయణ పొంగులేటి కారణంగా సీఎం రేవంత్ రెడ్డికి పదవీ గండం ఉందని కీలక కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ అటు కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆసక్తికర చర్చకు దారి తీశాయి.